రెజ్లర్ రవి కుమార్‌‌కు భారీ మనీ ప్రైజ్.. ఊరిలో ఇండోర్ స్టేడియం

రెజ్లర్ రవి కుమార్‌‌కు భారీ మనీ ప్రైజ్.. ఊరిలో ఇండోర్ స్టేడియం

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. 57 కిలోల విభాగంలో రష్యన్ రెజ్లర్ జౌ రొగేవ్‌తో జరిగిన ఫైనల్స్‌లో 7–-4 తేడాతో హోరాహోరీగా పోరాడి రవి కుమార్ ఓడిపోయాడు. భారత్‌కు పతకం తెచ్చిపెట్టిన రవి కుమార్‌‌ స్వస్థలం హర్యానా కావడంతో ఆ రాష్ట్ర ప్రభత్వం అతడికి భారీ నజరానా ప్రకటించింది. రూ.4 కోట్ల క్యాష్ ప్రైజ్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగం, కన్సెషన్ రేటులో ఒక ప్లాటు ఇస్తున్నట్లు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. అలాగే రవి కుమార్‌‌ దహియా సొంతూరు నహరిలో అధునాతన సౌకర్యాలతో ఇండోర్ స్టేడియం కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన రవి కుమార్ దహియా హర్యానాతో పాటు యావత్‌ దేశం మొత్తం హృదయాలను గెలిచాడని అన్నారు. సిల్వర్ మెడల్ గెలిచిన దహియాకు కంగ్రాట్స్‌ అని చెప్పారు. మరిన్ని విజయ శిఖరాలను అందుకుంటాడని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే హాకీ మెన్స్ టీమ్ కాంస్య పతకం గెలవడంతో టీమ్‌లో ఇద్దరు ప్లేయర్లు హర్యానాకు చెందిన వాళ్లు ఉండడంతో ఒక్కొక్కరికి రూ.2.5 కోట్ల చొప్పున నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నట్లు సీఎం ఖట్టర్ ప్రకటించారు.