రాజకీయం అంటే త్రివిక్రమ్ రాసిన డైలాగులు చదవడం కాదు

హైదరాబాద్, వెలుగు: సెటిలర్లకు సమస్య వస్తే నాగబాబు, పవన్ కాపాడుతారా లేక పార్టీ మూసేసి మేకప్ వేసుకున్న చిరంజీవి కాపాడుతారా అని సినీరచయిత చిన్నికృష్ణ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో 70 ఏళ్లుగా ఎన్నో రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. సెటిలర్స్ అంతా బాబు, పవన్ కు వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు . ఐదేళ్లుగా హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాలవారు కలిసిమెలసి ఉన్నారు. సీఎం కేసీఆర్ మంచి పాలన అందిస్తున్నారు . ఏపీలో ఫీజురియింబర్స్ మెంట్ రాక చాలా మంది విద్యార్థులు హైదరాబాద్లో  పనులు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఏపీ నేతలను తిట్టారు తప్ప ప్రజలను ఒక్క మాట అనలేదు. బాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే పవన్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో అర్థం కావటం లేదు. ఏపీలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌‌‌‌ సీఎం అవడం ఖాయం.రాజకీయం అంటే త్రివిక్రమ్ రాసిచ్చిన డైలాగులు చదవడం కాదు. విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ కు 62 పిల్లర్లు పూర్తి చేయని బాబు.. అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తారు? గోదావరి పుష్కరాల్లో బోయపాటి శ్రీను చెప్పినట్లు బాబు చేయడంతో ఎంతో మంది చనిపోయారు” అని ఆరోపించారు.

Latest Updates