ద్రవిడ్‌ మెసేజ్ జోష్​ ఇచ్చింది

న్యూఢిల్లీఅసలే వరల్డ్‌‌కప్‌‌. అందునా సెమీఫైనల్‌‌ మ్యాచ్‌‌. పైగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌తో పోరు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్‌‌ క్రికెటర్లే ఒత్తిడికి గురవడం సహజం. కానీ, అండర్–19 ప్రపంచకప్‌‌ సెమీస్‌‌లో ఇండియా యంగ్‌‌ క్రికెటర్‌‌ యశస్వి  జైస్వాల్‌‌ అలవోకగా సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. ఇంత పెద్ద మ్యాచ్‌‌లో ఏ మాత్రం టెన్షన్‌‌ పడకుండా కూల్​గా తన పని పూర్తి చేశాడు. మ్యాచ్‌‌కు ముందు కోచ్‌‌లతో పాటు వెటరన్‌‌ క్రికెటర్‌‌ వసీం జాఫర్‌‌తో మాట్లాడడం, లెజెండరీ క్రికెటర్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌  వీడియో (పాతది) మెసేజ్​ చూసి స్పూర్తి పొందడం వల్లే తాను అంత బాగా ఆడానని యశస్వి చెప్పాడు. ‘ఈ మ్యాచ్​కు  ముందు రాహుల్‌‌ ద్రవిడ్‌‌ సర్‌‌  వీడియో చూశాం. అది మమ్మల్ని ఎంతగానో మోటివేట్‌‌ చేసింది.  క్రికెట్‌‌ 22 గజాల  పిచ్‌‌పైనే ఆడతారన్న విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, దీన్ని కూడా మరో మ్యాచ్‌‌లానే భావించి ఆటపైనే ఫోకస్‌‌ పెట్టాలని ఆయన ఇచ్చిన సందేశం ఎంతగానో ఉపయోగపడింది. అలాగే, ఇక్కడి కోచ్‌‌లతో పాటు కెప్టెన్‌‌ ప్రియమ్‌‌ గార్గ్‌‌తో కలిసి వసీం (జాఫర్‌‌) భాయ్‌‌తో కూడా మాట్లాడా. వాళ్లందరూ నాకు ఒక్కటే చెప్పారు. మ్యాచ్‌‌లో ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపిస్తే.. తర్వాతి కొన్ని ఓవర్లు నిదానంగా ఆడమన్నారు. నీళ్లు తాగి, సింగిల్స్‌‌ కోసం ప్రయత్నించామని చెప్పారు. మెయిడిన్‌‌ అయినా  సరే క్రీజులోనే ఉండమన్నారు. నేను అదే పని చేశా.  50 నుంచి 60 రన్స్‌‌ మధ్య నేను  సింగిల్సే తీశా. మళ్లీ కాన్ఫిడెన్స్‌‌ వచ్చిన వెంటనే షాట్స్‌‌ కొట్టడం స్టార్ట్‌‌ చేశా’ అని జైస్వాల్‌‌ చెప్పుకొచ్చాడు.

సీక్రెట్‌‌గా యశస్వి ఆట చూస్తున్న కోచ్‌‌

ఏడేళ్లుగా యశస్వి జైస్వాల్‌‌ను తీర్చిదిద్దుతున్న కోచ్‌‌ జ్వాలా సింగ్‌‌  సౌతాఫ్రికా వచ్చి  ఓ సాధారణ ప్రేక్షకుడిగా తన శిష్యుడి ఆటను రహస్యంగా చూస్తున్నాడు. ఈ విషయం యశస్వికి తెలియదు. ఎందుకంటే జ్వాలా సింగ్‌‌ను సౌతాఫ్రికా రావొద్దని చెప్పాడు. అయినా  సౌతాఫ్రికా వచ్చిన సింగ్​  పాకిస్థాన్‌‌పై జైస్వాల్‌‌ సూపర్‌‌ సెంచరీని  స్టాండ్స్‌‌ నుంచి చూశాడు. ఈ టోర్నీలో టాప్‌‌ స్కోరర్‌‌గా నిలవాలని యశస్వితో ప్రామిస్‌‌ చేయించుకున్నానని జ్వాలా సింగ్‌‌ చెప్పాడు. అలా చేస్తే కొత్త కారు  కొనిస్తానని అతనికి మాటిచ్చానన్నాడు. ప్రస్తుతం 312 రన్స్‌‌తో జైస్వాల్‌‌ టోర్నీలో లీడ్‌‌ స్కోరర్‌‌గా ఉన్నాడు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates