‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లో పొలిటికల్ ఎనలిస్ట్‌గా వైసీపీ లీడర్

సంచలనాలకు మారు పేరైన దర్శకుడు ఆర్జీవీ తీస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. టైగర్ కంపెనీ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కెఎ. పాల్ తదితర పాత్రలన్నీ ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠతను రేపుతున్నాయి. పాటలు, ట్రైలర్ విడుదలచేసిన ఆర్జీవీ.. ఇప్పుడు రోజుకో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన ఫోటోను ట్యాగ్ చేసి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లో మరో కొత్త నటుడు అని కామెంట్ పెట్టాడు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కేవలం దర్శక నిర్మాతగానే కాకుండా ఆర్జీవీ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడా అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.

తాజాగా ఈ రోజు ఆర్జీవీ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లో పొలిటికల్ ఎనలిస్ట్‌గా నటిస్తున్నాడంటూ కమెడియన్ పృధ్వీతో దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇలా ఆర్జీవీ రోజుకో పాత్రను పరిచయం చేస్తూ ప్రేక్షకులలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై అంచనాలను పెంచుతూనే ఉన్నాడు. కమెడియన్ పృధ్వీ వైసీపీలో చేరిన తర్వాత.. సీఎం జగన్ ఆయనను ఎస్వీబీసీ చానల్‌కు చైర్మన్‌కు నియమించారు. పృధ్వీ ఒక పక్క సినిమాలలో నటిస్తూనే.. మరోపక్క చానల్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు.

Latest Updates