సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటాం

రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉన్న వ్య‌క్తులు ప్ర‌భుత్వంపై విషం క‌క్క‌కూడ‌ద‌ని, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హారంలో సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్తున్నామ‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. త‌న పార్టీ అధికారంలోకి లేక‌పోయిన త‌న మ‌నుషులే అధికారం చ‌లాయించాల‌ని చంద్ర‌బాబు కోరుకుంటున్నార‌ని, ఎస్ఈసీ కేసులో నిమ్మగడ్డ రమేశ్ కు అనుకూలంగా తీర్పు రాగానే టీడీపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారని అన్నారు. కోర్టు తీర్పు కాపీ అంద‌కుండానే నిమ్మ‌గ‌డ్డ త‌న‌కు తానే ఎస్ఈసీగా నియ‌మించుకుంటున్న‌ట్లు ఎలా ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సోమ‌వారం విజ‌య‌సాయి రెడ్డి విశాఖప‌ట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టుకు వెళ్తున్న‌ట్లు చెప్పారాయ‌న‌. వైసీపీ నాయకులు ,కార్యకర్తలకు న్యాయస్థానాల‌పై నమ్మకం ఉందని, గతంలో కాంగ్రెస్ పార్టీ త‌మ‌ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి వేధించినా.. న్యాయపరంగానే పోరాడామ‌ని ఆయ‌న గుర్తు చేశారు.

టీడీపీ క‌వ్వింపు చ‌ర్య‌ల‌తోనే..

తాము ఎప్పుడూ న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌ర‌చ‌లేద‌ని విజ‌య‌సాయి రెడ్డి చెప్పారు. టీడీపీ వాళ్ల క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు త‌మ వాళ్లు పోస్టుల పెట్టార‌న్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టింద‌ని, మొద‌టి నుంచి త‌మ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇస్తున్నామ‌ని చెప్పారాయ‌న‌. త‌మ వారికి ఏం జ‌రిగినా అండ‌గా నిలుస్తామ‌న్నారు. టీడీపీ కార్యకర్తలు త‌న‌ పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి త‌మ‌ నాయకుడిపైనే తప్పుడు పోస్టులు పెట్టార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. తాను చ‌నిపోయే వ‌ర‌కూ వైసీపీలోనే ఉంటాన‌ని, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెంట‌నే న‌డుస్తాన‌ని తెలిపారు.

Latest Updates