హుందాతనం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరం

ycp-mla-roja-setairs-on-chandra-babu

టీడీపీ హయాంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరును రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు YCP ఎమ్మెల్యే రోజా. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆమె టీడీపీపై మండిపడ్డారు.  అసెంబ్లీలో హుందాతనం గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారన్నారు. గతంలో డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మను కన్నీళ్లు పెట్టించింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. పార్టీ పెట్టి గెలిపించిన ఎన్టీఆర్‌కే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబు సంప్రదాయాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు సభా సంప్రదాయాలు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చను దారిమళ్లించేందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

సభలో బడ్జెట్‌పై మాట్లాడే దమ్మూ, ధైర్యం లేకే చర్చ జరగకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పారు రోజా. రైతుల సమస్యలంటూ టీడీపీ నాయకులు మాట్లాడటం వింతగా ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు YCP వారిపై దాడులు చేస్తున్నారన్నారు. మళ్లీ వాళ్లే అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరమన్నారు. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ నేత చింతమనేని కొట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే విచారణ లేకుండా చేసిన మీరా మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు. కాల్‌మని సెక్స్ రాకెట్‌లో ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తే టీడీపీ నేతలకు సంబంధముందని కేసులనే లేకుండా చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించిన రోజా…. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారన్నారు.

Latest Updates