టీడీపీ నేతలు కల్లుతాగిన కోతుల్లా…

టీడీపీ నేతలు కల్లుతాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అధికారం పోయాక వారికి పిచ్చెక్కిందని, వారందర్నీ డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్ళి పిచ్చిని నయం చేయాలని ఆమె అన్నారు. మద్యపాన నిషేధం దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని చెప్పారు. 43వేల‌ బెల్ట్ షాపులు తీసేసిన ఘనత సీఎం జగన్ ది అని చెప్పారు. వైన్స్‌ను, బార్లను 40 శాతం వరకూ తగ్గించారన్నారు.

చంద్రబాబు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసిన రోజా.. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని అన్నారు. టీడీపీ ఆఫీస్ లో మద్యం బాటిళ్లను ప్రదర్శించారంటే అది టీడీపీ ఆఫీసా, లేకపోతే లోకేశ్‌ వైన్‌షాపా, కాకపోతే చంద్రబాబు బెల్టు షాపా? అని ఆమె ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి సంతకం అంటే ఐఎస్ఐ ముద్రలా ఉండాలని, బెల్ట్ షాపులు నిర్మూలిస్తానని ఆనాడు సంతకం చేసి బాబు మర్చిపోయారన్నారు. మహిళల తాళిబొట్లు తెగిపోయేలా చంద్రబాబు చేసారని, నారావారి పాలన ఐదు సంవత్సరాలు సారావారి పాలనలా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా….ఉద్యోగులపై దాడులు చేసింది టీడీపీనే అని, మహిళా తహసిల్దార్‌ వనజాక్షిపై దాడిచేస్తే సెటిల్‌ మెంట్‌ మినిస్టర్‌ గా చంద్రబాబు పంచాయితీ చేసిన సంగతి అందరికి తెలిసిందేనని రోజా ఈ సందర్భంగా అన్నారు. మేం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఉద్యోగులకు ఎంత గౌరవం ఇస్తున్నామో అందరికి తెలుసని చెప్పారు.

Latest Updates