యెస్ బ్యాంక్ షేక్.. దేశ వ్యాప్తంగా డిపాజిటర్ల గగ్గోలు

  • విత్‌‌డ్రా కోసం బ్రాంచ్‌‌లు, ఏటీఎంల ముందు జనం క్యూ
  • పైసలెటుపోవన్న కేంద్రం, రిజర్వ్‌‌ బ్యాంక్‌‌
  • రిజొల్యూషన్‌‌ ప్లాన్‌‌ రెడీ చేశామన్న ఆర్‌‌బీఐ
  • ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఆప్షన్లు వెతుకుతున్న ఎస్‌‌బీఐ
  • ఆర్​బీఐ ఆంక్షలతో రూ. 16.60కు పడిపోయిన షేర్
  • బ్యాంక్​ ఫౌండర్ రాణాకపూర్​ విదేశాలకు పారిపోకుండా లుక్​ఔట్​​ నోటీసులిచ్చిన ఈడీ

ఏడాది కిందటి వరకు సూపర్‌‌గా నడిచింది యెస్‌‌ బ్యాంక్‌‌. కోట్ల మంది కస్టమర్లు. రూ. 2 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎన్‌‌పీఏలు పెరిగాయంటూ ఆర్‌‌బీఐ మారటోరియం విధించడం, విత్‌‌డ్రాలపై పరిమితులు పెట్టడంతో బ్యాంక్‌‌ షేర్‌‌ కుప్పకూలింది. ఏడాదిన్నర కింద రూ. 400 పలికిన బ్యాంక్‌‌ షేర్‌‌ ఒక్కసారిగా రూ.16.60కు పడిపోయింది. అన్ని అకౌంట్లు కలిపి ఒక వ్యక్తికి రూ. 50 వేలే విత్‌‌డ్రా పరిమితి విధించడంతో పైసలు పెట్టిన డిపాజిటర్లు బ్యాంక్‌‌ ఏటీఎంలు, బ్రాంచ్‌‌ల ముందు క్యూ కట్టారు. పైసలెటూ పోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌, ఆర్బీఐ హామీ ఇచ్చినా పరిస్థితేం మారలేదు. రూ.2 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లున్న యెస్‌‌ బ్యాంకు.. కస్టమర్లకు రూ. 2 లక్షల కోట్లకుపైనే అప్పులిచ్చింది.కానీ వాళ్లు డబ్బులు సరిగా కట్టకపోవడంతో ఎన్‌‌పీఏలు పెరిగాయి. దీంతో బ్యాంక్‌‌ క్యాపిటల్‌‌ కరిగిపోయింది. కొత్తగా క్యాపిటల్‌‌ సమకూర్చుకోవాలని ఆర్‌‌బీఐ చెప్పినా వాళ్లకు ఇన్వెస్టర్లు దొరకలేదు. ఇక లాభం లేదనుకొని బ్యాంక్‌‌ను ఆర్‌‌‌‌బీఐ పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చేసుకుంది. కొత్త ఇన్వెస్ట్‌‌ బ్యాంకర్‌‌‌‌ కోసం రిజల్యూషన్ ప్లాన్‌‌ తయారు చేసింది. పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌‌బీఐ ముందుకొచ్చిందని వెల్లడించింది. దీనిపై ఈ నెల 9లోగా జనం నుంచి సలహాలు సేకరించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. కాగా, మనీల్యాండరింగ్‌‌ కేసులకు సంబంధించి బ్యాంక్‌‌ ఫౌండర్‌‌ రాణాకపూర్‌‌పై ఈడీ లుక్‌‌ అవుట్‌‌ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంట్లో సోదాలు చేసింది.

కుటుంబ గొడవలతో మొదలై..

2004 లో తోడల్లుడు అశోక్ కపూర్‌‌తో కలిసి రాణా కపూర్‌‌ బ్యాంక్‌‌ పెట్టారు. బ్యాంక్‌‌ సీఈవోగా రోజువారీ పనులు చూడటమే కాకుండా ఇండస్ట్రియలిస్టులతో కూర్చొని లోన్లు ఫైనల్‌‌ చేసేవాడు. ఆయన ఆధ్వర్యంలో పదేళ్ల పాటు బ్యాంక్‌‌ దూసుకెళ్లింది. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌, అనిల్‌‌ అంబానీ అడాగ్‌‌ గ్రూప్‌‌ వంటి దివాలా కంపెనీలకూ అప్పులిచ్చింది. అయితే అశోక్‌‌ ఆకస్మిక మరణంతో ఆయన కూతురుకు డైరెక్టర్‌‌ పొజిషన్‌‌ ఇచ్చే విషయం కుటుంబ తగాదాగా మారింది. అప్పటి నుంచే బ్యాంక్‌‌ నిర్వహణలో, గవర్నెన్స్‌‌లో లోపాలు మొదలయ్యాయి. మరోవైపు బ్యాంక్‌‌ నుంచి తీసుకున్న అప్పులను తిరిగి కట్టడంలో ఫెయిలవుతున్న ఇండస్ట్రియలిస్టుల జాబితా పెరిగింది. దీంతో ఒకప్పుడు స్టాక్‌‌ మార్కెట్లో ఇన్వెస్టర్లకు ఎంతో ఇష్టమైన యెస్‌‌ బ్యాంక్‌‌ షేర్‌‌ 7 నెలల్లో దారుణంగా పడిపోయింది. 2019 ఆగస్టులో రూ. 400 పైన పలికిన బ్యాంక్‌‌ షేర్‌‌ ఇటీవల రూ.30కి పతనమైంది. ఎస్‌‌బీఐ తన చేతిలోకి తీసుకోనుందనే రూమర్లతో గురువారం 26 శాతం పెరిగి రూ.36 వద్ద ముగిసినా ఆర్‌‌‌‌బీఐ ప్రకటనతో శుక్రవారం మళ్లీ రూ.5.65కి పడిపోయింది. తర్వాత పుంజుకొని రూ.16.60 వద్ద క్లోజైంది. మొత్తంగా 56 శాతం తగ్గింది.

టీటీడీకి తప్పిన యెస్‌‌ బ్యాంక్‌‌ సెగ

తిరుమల, వెలుగు: తిరుమల శ్రీనివాసుడికి యెస్ బ్యాంక్‌‌ సంక్షోభం సెగ కొద్దిపాటిలో తప్పింది. బ్యాంక్‌‌లో అలజడిని ముందే పసిగట్టిన టీటీడీ ఆ బ్యాంక్‌‌లోని రూ. 1,300 కోట్లను కొన్ని నెలల కిందే విత్‌‌డ్రా చేసుకుంది. జాతీయ బ్యాంక్‌‌లకు మళ్లించింది. మిగిలిన ప్రైవేటు బ్యాంక్‌‌లలోని  డిపాజిట్లపైనా టీటీడీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం టీటీడీకి ఫెడరల్ బ్యాంక్‌‌లో రూ.130 కోట్లు, సౌత్ ఇండియా బ్యాంక్‌‌లో రూ.1,300 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌‌లో రూ.1,300 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌‌లో రూ. 600 కోట్ల మేర డిపాజిట్లున్నాయి. భవిష్యత్‌‌లో బ్యాంక్‌‌ల రేటింగ్‌‌ ఆధారంగా డిపాజిట్లు చేయాలని అధికారులకు టీటీడీ బోర్డు సూచించింది.

మీ మనీకి ఏం కాదు..

డబ్బంతా సేఫ్‌‌‌‌గా ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ డిపాజిటర్లకు ఉపశమనం కల్పించారు. ప్రభుత్వం, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కలిసి యెస్ బ్యాంక్ కుప్పకూలకుండా కాపాడతామని హామీ ఇచ్చారు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ‘ఆర్‌‌‌‌‌‌‌‌బీఐతో నేను కంటిన్యూగా మాట్లాడుతున్నా. వెనువెంటనే సమస్యను పరిష్కరిస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ హామీ ఇచ్చింది. మేము పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నాం’ అని నిర్మలా తెలిపారు. ఏ ఒక్క డిపాజిటర్‌‌‌‌‌‌‌‌ కూడా తమ మనీ పోగొట్టుకోరని, డిపాజిటర్ల మనీ అంతా సేఫ్‌‌‌‌గా ఉంటుందని పేర్కొన్నారు. డిపాజిటర్లు, బ్యాంక్‌‌‌‌లు, ఎకానమీ ప్రయోజనం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. యెస్ బ్యాంక్‌‌‌‌ను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ అదుపులోకి తీసుకోగానే, డిపాజిటర్లు యెస్ బ్యాంక్ ఏటీఎంల వద్దకు పరుగెత్తారు. తమ మనీని విత్‌‌‌‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని ఏటీఎంల వద్ద జనం తాకిడి పెరిగిపోయి, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో డిపాజిటర్ల మనీకి ఏం కాదని, అంతా సేఫ్‌‌‌‌గా ఉంటుందని నిర్మలా హామీ ఇచ్చారు.

 

 

Latest Updates