ఫిట్ నెస్: ముఖానికి యోగా

ముఖాన్ని ఎనిమిది వంకర్లు తిప్పితే.. మీ వయసు ఓ ఏడెనిమిదేళ్లు తగ్గిపోతుంది. అదీ  ఓ వ్యాయామమే. ముఖ యోగా అన్నమాట. అందంగా కనిపించేందుకు చాలామంది ఏవేవో చేస్తుంటారు. కొంతమంది బ్యూటీపార్లర్స్​, సర్జరీలను ఆశ్రయిస్తే మరికొందరు ఇంట్లోనే ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.  అలాంటి వాళ్లకోసమే ఈ ఫేస్ యోగా. ముఖంపై ముడతలు, ఫేస్ ఫ్యాట్​ ఉన్నవాళ్లు ఈ యోగా చేయడం వల్ల చక్కని ముఖాకృతి ఏర్పడుతుంది.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

బుగ్గలు ఊదాలి..

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి.  బుగ్గల నిండా గాలి నింపుకుని బెలూన్​లా  చేసి వదలాలి.  తర్వాత  వేళ్లతో ముఖాన్ని మసాజ్​  చేయాలి. మళ్లీ బుగ్గల నిండా గాలి నింపుకుని  ముందులా చేయాలి. ఇలా  నాలుగైదు సార్లు చేసిన తర్వాత.   మెడ, గడ్డం భాగంలో వేళ్లతో మసాజ్​ చేయాలి.  తర్వాత చెవి కింద భాగంలో పది సెకన్ల పాటు  వేళ్లతో నొక్కి పట్టి ఉంచాలి.

కనుబొమ్మలు ఎత్తాలి…

ముందుగా అద్దం ముందు ప్రశాంతంగా కూర్చోండి.  రెండు వేళ్లతో ఒక కనుబొమ్మను మెల్లగా పైకి లాగి, దించండి. అలా రెండు కనుబొమ్మలకూ చేయండి. ఇలా అయిదారు సార్లు సాధన చేయండి.

పెదాలు సాగదీయాలి…

వజ్రాసనంలో కూర్చొని చేతివేళ్లతో ముఖాన్ని  మసాజ్ చేయాలి. తర్వాత రెండు చూపుడు వేళ్లతో ఫొటోలో చూపిన విధంగా పెదాలను సాగదీయాలి. ఇప్పుడు ముఖాన్ని  పది సార్లు మసాజ్​ చేయాలి. మరొక సారి  పైన చెప్పినట్లే చేయాలి. ఇలా నాలుగైదు సార్లు సాధన చేయాలి.

చేపలా అంటూ…

వజ్రాసనంలో  కూర్చోవాలి. తర్వాత  మూతిని చేప  నోటిలా పెట్టి  పదిసెకన్లు ఉంచాలి. తరువాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటకు రావాలి. మళ్లీ కాస్త విరామం ఇచ్చి ఇలానే  ఐదు సార్లు చేయాలి.  ఇలా  తరచూ చేయడం వల్ల
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

నుదుటి వ్యాయామం…

సుఖాసనం వేసుకుని వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోవాలి. రెండు కనుబొమ్మలను వీలున్నంత దగ్గరగా తీసుకువచ్చి పైకి కదిలించాలి. 10 అంకెలు లెక్క పెట్టి  తర్వాత ఇదే విధంగా కిందకు (ముక్కువైపు) కదిలించాలి. ఇలా కొంచెం విరామంతో 5 సార్లు చేయాలి.  తర్వాత ముఖం కదలకుండా రెండు చేతులతో నుదురు నుంచి తల వరకు 10 సెకన్లు పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నుదుటి కండరాలు, నాడులు చురుగ్గా పనిచేస్తాయి. మాడు మొదలు నుదుటి వరకు ఉన్న భాగమంతా ఒత్తిడి నుంచి బయట పడుతుంది.

 

 

Latest Updates