కరోనాపై ఫైట్‌కు యోగా ఎంతగానో సహాయపడుతోంది

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ కారణంగా గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు యోగా అవసరం ప్రపంచానికి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఇండియాకు చెందిన పురాతనమైన ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పేషెంట్లు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నారని, వారికి యోగా ఎంతగానో సహాయపడుతోందని చెప్పారు. మనుషుల శ్వాస కోస వ్యవస్థపై కరోనా వైరస్​ దాడి చేస్తోందని, ప్రాణాయామం లేదా బ్రీతింగ్​ ఎక్సర్​సైజ్​ వల్ల రెస్పిరేటరీ సిస్టంను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. యూనిటీకి ఒక శక్తిగా యోగా అవతరించిందని, దానికి కులం, మతం, రంగు, లింగం, నమ్మకం, దేశంతో సంబంధం లేదని, అందరికీ ఒక్కటి చేసే సామర్థ్యం యోగాకి ఉందని మోడీ చెప్పారు. ఆరో ఇంటర్నేషనల్​ యోగా డే సందర్భంగా ఆదివారం ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన సందేశం కొనసాగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ఈ ఏడాది యోగా డే ను ఎక్కువగా డిజిటల్ ఫార్మాట్​లో​నే నిర్వహించారు. ఈ ఏడాది యోగా థీమ్​ను యోగా ఎట్​ హోం.. యోగా విత్​ ఫ్యామిలీగా నిర్ణయించారు.

యోగాకు వివక్ష ఉండదు

‘‘యోగా భూమిని హెల్దీ ప్లానెట్​గా మారుస్తోంది. యూనిటీకి అది ఒక శక్తిగా పనిచేస్తోంది. మానవత్వాన్ని మరింత విస్తృతం చేస్తోంది. అది ఎలాంటి వివక్షను చూపదు. ఎవరైనాసరే దీనిని అనుసరించవచ్చు”అని మోడీ అన్నారు. ‘‘మన ఇమ్యూనిటీ సిస్టం మంచిదైతే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అది ఎంతో ఉపయోగపడుతుంది. అదే ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే యోగాలో ఎన్నో రకాల మార్గాలున్నాయి. వివిధ రకాలైన ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు శరీరంలోని శక్తిసామర్థ్యాలను పెంచుతాయి. అలాగే మన మెటబాలిజంను కూడా పెంచుతుంది. బ్రీతింగ్​ ఎక్సర్​సైజుల్లో ఒకటైన ప్రాణాయామం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో సీతాలీ, కాపాల్​బాతీ, భరస్తికా లాంటి వెరైటీలు ఉన్నాయి” అని చెప్పారు.

ఫిజికల్​, మెంటల్​ బ్యాలెన్స్​

యోగా ఫిజికల్​ సామర్థ్యాన్ని కల్పించడమేకాకుండా మెంటల్​ బ్యాలెన్స్​ను, ఎమోషనల్​ స్టెబులిటీని, మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు శక్తిని అందిస్తుందని చెప్పారు. హోప్​, హెల్త్​కు సంబంధించి మన ఆలోచనలను మార్చుకున్నట్లయితే హెల్దీ, హ్యాపీ ప్రపంచాన్ని చూసే రోజు ఎంతో దూరంలో ఉండదని చెప్పారు. ఇది జరిగేలా చేయడంలో యోగా కచ్చితంగా మనకు ఉపయోగపడుతుందన్నారు. 2014 డిసెంబర్​ 11న యునైటెడ్​ నేషన్స్​ జనరల్​ అసెంబ్లీ జూన్​ 21ని ఇంటర్నేషనల్​ యోగా డే గా ప్రకటించింది. అంతకు కొన్ని నెలల ముందు ప్రధాని మోడీ జూన్ 21ని ఇంటర్నేషనల్​ యోగా డేగా ప్రకటించాలని ప్రతిపాదించారు. 2015 జూన్ 21న తొలిసారిగా డిజిటల్​ ప్లాట్​ఫాంలో యోగా డేను నిర్వహించారు.

ప్రపంచానికి ఇండియా గిఫ్ట్: కోవింద్

ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గొప్ప గిఫ్ట్‌‌ యోగా అని రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ అన్నారు. ఇంటర్నేషనల్​ యోగా డే సందర్భంగా తాను యోగా చేస్తున్నఫొటోలను కోవింద్ ట్వీట్ చేశారు. ‘ఇంటర్నేషనల్​ యోగా డే శుభాకాంక్షలు. పురాతనమైన యోగా ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గొప్ప బహుమతి. దీన్ని చాలా మంది అనుసరించడం హ్యాపీగా ఉంది. యోగా సాధన ద్వారా శరీరాన్ని ఫిట్‌‌గా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు’ అని అన్నారు. ఫిజికల్ ఫిట్‌‌నెస్‌‌తోపాటు మెంటల్ ఫిట్‌‌నెస్‌‌ను సమతూకం చేసే యోగాను ప్రతి ఇండియన్ తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఉప రాష్ట్రపతి ఓ ట్వీట్ చేశారు.

ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు

యోగాలోని ఈ రకాలన్నీ కూడా రెస్పిరేటరీ, ఇమ్యూనిటీ వ్యవస్థలను బలపరుచుకోవడానికి ఉపయోగపడతాయని, రోజువారీ కార్యకలాపాల్లోనూ ప్రాణాయామాన్ని వాడుకోవడం నేర్చుకోవాలని మోడీ సూచించారు. యోగాలోని టెక్నిక్స్​ను వాడుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా పేషెంట్లు ఎన్నో లాభాలు పొందారని,ఈ మహమ్మారిని ఓడించడంలో వారికి కరోనా ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. కొంచెం ప్లేస్.. కొంచెం సమయం కేటాయిస్తే చాలు.. ఎవరైనా యోగా చేయొచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates