అయోధ్యను ప్రపంచమే గర్వించేలా చేస్తాం: యోగి ఆదిత్యనాథ్‌

  • ఆగస్టు 5 శంకుస్థాపన సందర్భంగా అధికారులతో భేటీ
  • అందరూ దీపాలు వెలిగించి కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి

అయోధ్య : ఉత్తర్‌‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని రామ మందిరం, హనుమాన్‌ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆగస్టు 5న జరగనున్న శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆ కార్యక్రమం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయోధ్య దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. “ ప్రధాని మోడీ అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారు. కచ్చితంగా అయోధ్యని దేశం, ప్రపంచం గర్వించదగేలా చేస్తాం” అని యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. రాముడు 14 ఏళ్ల తర్వాత వనవాసం నుంచి తిరిగివచ్చినట్లుగా భావించి ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించాలని అన్నారు. “ ఈ మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చేసుకుందాం. ఆగస్టు 4, 5 న దేశంలో అందరి ఇళ్లలో దీపాలు పెడదాం. అయోధ్య లేకుండా దీపావళి పండుగను వూహించలేం” అని యోగి అన్నారు. వీహెచ్‌పీ ఫంక్షనరీ సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పర్నాడే కూడా దీనిపై మాట్లాడారు. శంకుస్థాపన రోజు అయోధ్యలోని గుడితో పాటు ప్రతి ఇంటిని పూలతో అలంకరించుకోవాలని అన్నారు. ప్రతి ఇంట్లో దీపంపెట్టాలని, దేశంలోని హిందువులకు రామ మందిర నిర్మాణం పెద్ద పండగని ఆయన అన్నారు. చాలాపెద్ద యుద్ధం తర్వాత రామమందిరం నిర్మాణం జరుగుతోందని అన్నారు. కరోనా కారణంగా కోట్లాది మంది పాల్గొన్నాల్సిన కార్యక్రమం తక్కువ మందితో నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరు ఇళ్లలో దీపాలు వెలిగించి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పారు. అయోధ్యలో ఆగస్టు 5న రామమందిరం నిర్మాణం ప్రారంభం కానుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టే 5న శంకుస్థాపన చేయనున్నారు.

Latest Updates