జపాన్ కొత్త ప్రధాని ఎవరంటే..?

టోక్యో: అనారోగ్య కారణాలతో జపాన్ ప్రధాని పదవి నుంచి షింజో అబే రీసెంట్‌‌గా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్లేస్‌‌లో బాధ్యతలు తీసుకునే నాయకుడిపై స్పష్టత వచ్చింది. జపాన్ కాబోయే ప్రధాని పదవి కోసం అధికార పార్టీ నిర్వహించిన పార్లమెంటరీ ఎన్నికల్లో యొషిహిడే సుగా విజయం సాధించారు. లిబెరల్ డెమొక్రటిక్ పార్టీ నిర్వహించిన ఈ ఎన్నికల్లో సుగాకు 377 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు మొత్తంగా కలిపి 157 ఓట్లు దక్కాయి. దీంతో ప్రధానిగా సుగా బాధ్యతలు తీసుకోవడం లాంఛనప్రాయమే. ప్రస్తుతం అబే ప్రభుత్వంలో చీఫ్ క్యాబినెట్ సెక్రటరీగా సుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయడంలో సుగాకు మంచి పేరు ఉంది.

స్వాగతం పలుకుతున్న సవాళ్లు
జపాన్‌‌లో ఫారెన్ టూరిజం ఇండస్ట్రీ ఎదుగుదలకు సుగా తీవ్ర కృషి చేశారు. అలాగే సెల్‌‌ఫోన్ బిల్స్‌‌ తగ్గించడంలో, వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలలో మంచి ప్రతిభ చూపారు. ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలలో కూడా మంచి పేరు గడించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే సుగాకు పలు సవాళ్లు స్వాగతం చెబుతున్నాయి. కరోనా వైరస్‌‌తో పడిపోయిన ఎకానమీ, ఈస్ట్ చైనా సీలో డ్రాగన్ దుందుడుకు వైఖరి, టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ లాంటి పలు చాలెంజ్‌‌లు సుగా నాయకత్వ ప్రతిభకు సవాల్ విసురుతున్నాయి.

Latest Updates