కిస్తీ కడితే చాలు కారు ఇస్తారు

న్యూఢిల్లీ: నెలవారీగా సబ్‌‌స్క్రిప్షన్‌‌ చెల్లించి తమ కార్లను వాడుకునే విధానాన్ని మంగళవారం నుంచి హైదరాబాద్‌‌, పుణేలో మొదలుపెట్టామని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతానికి ఇండివిడ్యువల్స్‌‌ మాత్రమే ఈ సదుపాయం పొందవచ్చు. సబ్‌‌స్క్రిప్షన్‌‌ విధానంలో ఓరిక్స్ ఆటో ఇన్‌‌ఫ్రాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది.  కారు కొనుక్కోలేని వాళ్లు కిరాయి విధానంలో కొత్త కార్లను వాడుకునేందుకు ఢిల్లీ, బెంగళూరులో సబ్‌‌స్క్రిప్షన్‌‌ సర్వీసులను ఇదివరకే మొదలుపెట్టినట్టు మారుతీసుజుకీ ప్రకటించింది. నెలకు కొంతమొత్తం చెల్లించడం ద్వారా కొత్త కారును వాడుకోవచ్చు. ఈ మంత్లీ సబ్‌‌స్క్రిప్షన్‌‌లోనే కంప్లీట్‌‌ మెయింటనెన్స్‌‌, ఇన్సూరెన్స్‌‌, రోడ్‌‌సైడ్‌‌ అసిస్టెన్స్‌‌ వంటి సర్వీసులు ఉంటాయి.  స్విఫ్ట్‌‌, డిజైర్‌‌, విటారా, బ్రెజా, ఎర్టిగా, బాలెనో వంటి కార్లను నెక్సా, ఎరీనా షోరూమ్‌‌ల నుంచి తీసుకోవచ్చు. సబ్‌‌స్క్రిప్షన్‌‌ టైం పూర్తయ్యాక కూడా కారు కావాలనుకుంటే బైబ్యాక్‌‌ పద్ధతి ద్వారా కొనుక్కోవచ్చు. రాబోయే మూడేళ్లలో ఈ సేవలను 60 నగరాలకు విస్తరిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ విధానంలో   స్విఫ్ట్‌‌ ఎల్‌‌ఎక్స్‌‌ఐ మోడల్‌‌ను అద్దెకు తీసుకోవాలనుకుంటే 48 నెలలపాటు రూ.15,350 చెల్లించాలి.

Latest Updates