కోపాన్ని చూపిస్తే డబ్బులిస్తరంట..

లోపలి నుంచి తన్నుకొస్తున్న కోపాన్ని, ఫ్రస్ట్రేషన్‌‌ని బయట పడేస్తేనే మనసు కాస్త కుదుటపడుతుంది. కానీ అలా బయటపెట్టడానికి దారేది? మనుషులు మీద చూపించలేం. అలా అని మనలోనూ దాచుకోలేం. ఇలాంటి సిచ్యుయేషన్స్ కోసమే ‘వెంట్ ‌‌ఆలవుట్’ అనే ప్లాట్‌‌ఫాం ఒకటి మొదలైంది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌‌ఫాం ద్వారా ఎమోషన్స్‌‌ను బయటకు నెట్టేయొచ్చు. పైగా ఎమోషన్స్ షేర్ చేస్తూ సంపాదించొచ్చు కూడా.

మనలో ఎమోషన్స్ వచ్చినప్పుడు వాటిని పంచుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుందనిపిస్తుంది.  పైగా పంచుకుంటే నెగెటివ్ ఎమోషన్స్ తగ్గి, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అందుకే ఎమోషన్స్‌‌ను ఎప్పటికప్పుడు బయటపెడుతుండాలి. వెంట్‌‌ఆలవుట్ ద్వారా మనలో దాచుకున్న ఎమోషన్స్‌‌ని, కోపాన్ని , రోజూవారి పనుల్ని, వాటిని ఎలా ఫీలవుతున్నామన్న విషయాన్ని ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌‌ను  పంచుకోవచ్చు.

కోపం నుంచి విముక్తి

సోషల్ మీడియాలో ఇదొక కొత్తరకం ట్రెండ్. వెంట్ ఆలవుట్ ముఖ్య లక్ష్యం  కోపాన్ని తగ్గించడం. మనుషుల మీద లేదా ఏదైనా అంశం మీద అణచివేసిన , నెగెటివ్ ఎమోషన్స్‌‌ను, చిరాకులను పబ్లిక్‌‌గా పంచుకుంటూ.. వాటి నుంచి బయటపడటమే దీని కాన్సెప్ట్. అంతేకాదు, ఈ యాప్‌‌లో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు కూడా.

లాక్‌‌డౌన్‌‌లో పాపులర్

లాక్‌‌డౌన్ టైంలో సోషల్ మీడియా వాడకం ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో వెంట్‌‌ఆలవుట్‌‌కు కూడా యూజర్లు పెరిగారు.   ప్రస్తుతం ఈ యాప్‌‌ లో 12 వేల మంది రిజిస్టర్ అయ్యారు. ఈ వెబ్‌‌సైట్ రీసెంట్‌‌గానే మొదలైనా.. లాక్‌‌డౌన్ ముందు వరకూ దీని గురించి ఎవరికీ తెలీదు. లాక్‌‌డౌన్ టైంలో మాత్రం ఈ వెబ్‌‌సైట్ అచ్చంగా సెంటిమెంటల్ పోస్టులతో నిండిపోయింది. ‘నాకు ఇలా ఉంది, అలా ఉంది, నాకిప్పుడు కోపం వస్తోంది, అతనికసలు బుద్ధి ఉందా?’  ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు  కోపం వచ్చినవాళ్లపై అరిచేస్తూ, కడిగేస్తూ.. ఎమోషన్స్‌‌ను బయటపడేస్తూ రిలాక్స్ అవుతున్నారు.

ప్రైవేట్‌‌గా ఉంటూ..

వెంట్‌‌ఆలవుట్ ప్లాట్‌‌ఫాంలో నలుగురితో కలిసి డిస్కషన్లు చేయొచ్చు. ఇందులో మన యాక్టివిటీని బట్టి ‘వీపాయింట్స్’, ‘వీ అవార్డ్స్’ పొందొచ్చు. వీపోల్స్ ద్వారా అభిప్రాయాల్ని షేర్  చేయొచ్చు. అలాగే వీమూమెంట్స్ ద్వారా ఎమోషనల్  క్షణాల్ని, ఫొటోల్ని అందరితో పంచుకోవచ్చు. ఇందులో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే.. మన ప్రొఫైల్‌‌ను పబ్లిక్ లేదాప్రైవేట్‌‌గా ఉంచుకోవచ్చు. అంటే మనమెవరో ఇతరులకు తెలియకుండానే పోస్టులు పెట్టొచ్చన్న మాట. అలాగే ఇందులో మన డేటా కూడా పూర్తిగా సేఫ్ అని యాప్ నిర్వాహకులు చెప్తున్నారు.

సంపాదించొచ్చు కూడా

వెంట్ ఆలవుట్ ద్వారా డబ్బుకూడా సంపాదించొచ్చు. ఇందులో ఫీలింగ్స్ అన్నింటినీ ఓ స్టోరీలా రాసి  పోస్ట్ చేయవచ్చు. వెంట్ అండ్ ఎర్న్‌‌లో ఒక్కో స్టోరీకి 12 రూపాయల వరకూ సంపాదించొచ్చు. ఒక్కో స్టోరీకి 100 పదాలు ఉండాలి. ఇలా ఎన్ని పంపిస్తే అంత మనీ గెలుచుకోవచ్చు. అయితే ఆ కంటెంట్.. వెంట్ అండ్ ఎర్న్‌‌ టర్మ్స్ అండ్ కండిషన్స్‌‌కు కట్టుబడి ఉండాలి. కాపీ కంటెంట్, రిస్ట్రిక్టెడ్ పదాలు ఇందులో అనుమతించరు.

Latest Updates