నిరసన తెలిపితే ప్రజల్ని కాల్చేస్తారా?

ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న నిరసనకారులను కాల్చి చంపేయాలంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు సీఎం మమతా బెనర్జీ. ఈ రకమైన వ్యాఖ్యలు సిగ్గు చేటని అన్నారు. ఈ రకమైన కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారామె. ఆయన పేరును పలకడానికి కూడా తనకు సిగ్గుగా ఉందని చెప్పారు మమతా బెనర్జీ.

నిరసన తెలిపినందుకు ప్రజల్ని కాల్చి చంపాలా? అని ప్రశ్నించారు మమత. ప్రజలపై కాల్పుల్ని ప్రోత్సాహించడం దారుణమని అన్నారు. అలాంటివి జరగడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఆ రకమైన పరిస్థితులు రావన్నారు. కాల్పులు జరగాలన్న వ్యాఖ్యలతో రేపు రాష్ట్రంలో ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని దిలీప్ ఘోష్‌ను ఆమె హెచ్చరించారు.

CAAకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారినా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నా మమతా బెనర్జీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని నిన్న జరిగిన ఓ సభలో దిలీప్ ఘోష్ తప్పుబట్టారు. ఇదే పని యూపీ, కర్ణాటక, అస్సాంలో జరిగితే తమ ప్రభుత్వాలు కుక్కల్ని కాల్చినట్లు కాల్చేశారన్నారు. పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలు దాదాపు కోటి మంది పశ్చిమ బెంగాల్‌లోనే ఉన్నారని, వారిని మమత కాపాడుతున్నారని ఆరోపించారు. వాళ్లే ఆమె ఓటర్లని, అందుకే వారిని ఏమీ చేయడం లేదని అన్నారు.

 

Latest Updates