మ‌ద్యానికి బానిసై హైదరాబాద్ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

హైదరాబాద్ : మ‌ద్యానికి బానిసై ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మ‌ల్కాజ్‌గిరిలోని వాణీన‌గ‌ర్ లో చోటుచేసుకుంది. మల్కాజిగిరి ఏఎస్ఐ సుబ్బారాయుడు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… వాణీ న‌గ‌ర్ కు చెందిన యోగానాధ్ నిఖిల్(25) అనే యువ‌కుడు గ‌త కొంత‌కాలంగా సికింద్రాబాద్ లోని స‌న్‌షైన్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్నాడు. హాస్పిటల్‌లోని ఫార్మసీలో నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేయ‌డం ఇష్టం లేని అత‌డు.. 6 నెల‌ల క్రితం రైల్వే ట్రాక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. జాబ్ చేయ‌డం ఇష్టం లేద‌ని, అందుకే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని తండ్రి యోగానాథ్ అనిల్ కు ఫోన్ చేసి చెప్పాడు. అత‌ని ఫోన్ కాల్ కు భ‌య‌ప‌డిపోయి ఉద్యోగం చేయ‌క్క‌ర్లేద‌ని తండ్రి చెప్ప‌డంతో త‌న ప్ర‌య‌త్నం మానుకొని ఇంటికి తిరిగివ‌చ్చాడు. అంత‌కు ముందు నుంచే మ‌ద్యం అల‌వాటున్న నిఖిల్ అప్ప‌టి నుండి మ‌ద్యానికి పూర్తిగా బానిస‌య్యాడు. గ‌త 15 రోజుల నుంచి మ‌రీ విప‌రీతంగా మ‌ద్యం సేవి‌స్తున్నాడు.

అయితే శుక్ర‌వారం రాత్రి బ‌య‌ట మ‌ద్యం ‌‌సేవించి ఇంటికి వ‌చ్చిన నిఖిల్.. రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో త‌న బెడ్ రూమ్ కి వెళ్లి త‌లుపు వేసుకున్నాడు. గంట త‌ర్వాత తండ్రి పిలిచినా గ‌ది నుంచి బ‌య‌టికి రాక‌పోవ‌డంతో నిద్ర‌పోయి ఉండొచ్చని కుటుంబ స‌భ్యులు అనుకున్నారు. శనివారం ఉద‌యం 8:30 గంట‌ల స‌మయంలో మ‌ళ్లీ అత‌డి కోసం త‌లుపు త‌ట్టినా తీయలేదు . దీంతో అనుమానం వ‌చ్చి కిటికీ అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టి చూడ‌గా.. నిఖిల్ త‌న గ‌దిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోయి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిఖిల్ ఆత్మ‌హ‌త్య‌పై కేసు న‌మోదు చేసుకున్నారు. మ‌ద్యానికి బానిస అయినందువ‌ల్లే నిఖిల్ ఉరి వేసుకొని చ‌నిపోయాడ‌ని ఏఎస్ఐ తెలిపారు.

Latest Updates