పెళ్లైన 24 గంట‌ల్లోనే.. ప్రియుడితో మ‌ళ్లీ పెళ్లి

నల్లగొండ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి త‌న ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భ‌య‌ప‌డి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. ఆ విష‌యం తెలుసుకున్న ఆమె ప్రేమించిన వాడు పెళ్లయిన కాసేప‌టికి అక్క‌డి వ‌చ్చాడు. అతడిని చూసిన ఆ యువ‌తి.. వెంట‌నే భావోద్వేగానికి లోనై అత‌న్ని గట్టిగా పట్టుకుని ఏడ్వడంతో, ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ విషయమై పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టాడు. దీంతో ఆ యువతి ప్రేమ వ్యవహారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మౌనిక తనకు వరుసకు మామయ్య అయ్యే రాజేశ్​తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు మౌనికకు దేవరకొండకు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పే ధైర్యం లేని మౌనిక ఆ యువకుడితో పెళ్లికి అంగీకరించింది. వివాహమూ చేసుకుంది. ​ పెళ్లయిన కాసేపటికి అక్కడికి ఆమె ప్రేమించిన వ్య‌క్తి రాజేశ్​ వచ్చాడు. అతడిని చూసిన మౌనిక.. వెంటనే అతడిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఫలితంగా మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పలు చర్చల తర్వాత తాము ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నామని మగ పెళ్లివారు తేల్చి చెప్పారు. దాంతో ఈనెల 13న రాజేశ్​, మౌనికలు మళ్లీ వివాహం చేసుకున్నారు. ముందుగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న మౌనిక .. మర్నాడు తాను మనసిచ్చిన యువకుడిని మనువాడింది.

Latest Updates