బాయ్ ఫ్రెండ్ ను కలవాలి పంపించండి..పోలీసులను కోరిన యువతి

కరోనా వ్యాప్తిని నిరోధానికి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. దీంతో పోలీసులంతా భద్రతా చర్యల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో  హైదరాబాద్ పోలీసులకు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. తనకు బాయ్ ఫ్రెండ్ ను చూడాలని ఉందని, అతని దగ్గరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

అంబర్ పేటకు చెందిన ఓ యువకుడు, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నివాసం ఉంటున్న ఓ యువతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజు ఆ యువకుడు, ఆమె దగ్గరకు రావడంతో… చుట్టుపక్కల వారు పట్టుకుని, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు తమ బిడ్డను యువకుడు వేధిస్తున్నాడంటూ పోలీసు కేసు పెట్టారు. పోలీసులు అతన్ని విచారించారు. అయితే ఆమెపై తనకు ప్రేమ లేదని.. ఆ విషయాన్ని స్పష్టం చేసేందుకే వచ్చానని చెప్పాడు. దీంతో అతన్ని హెచ్చరించిన పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.

ఆ తర్వాత అతని ప్రియురాలు పోలీసుల దగ్గరకు వచ్చింది. తాను యువకుడిని కలవాల్సిందేనని పట్టుబట్టి కూర్చుంది. తనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, స్టేషన్ లోనే బైఠాయించింది. ఉన్నతాధికారులు… ఆమెకు లాక్ డౌన్ నిబంధనల గురించి వివరించి… సర్దిచెప్పి ఇంటికి పంపించారు.

Latest Updates