పట్టపగలే దారుణం.. ప్రేమించలేదని గొంతు కోసిండు

  • హన్మకొండ రాంనగర్​లో ఘటన
  • నమ్మించి రూమ్​కు తీసుకెళ్లి చంపేసిన షాహిద్​
  • ముందుగా సెంట్రల్​ జైలుకు..
  • తర్వాత పోలీస్​స్టేషన్​కు  వెళ్లి లొంగుబాటు

వరంగల్, వెలుగు:

దోస్త్​ అంటూ క్లాస్‍మేట్‍ అయిన యువతిని నమ్మించాడు. పెద్దమ్మ, పెద్దనాన్న అంటూ ఆమె తల్లిదండ్రులను మాయ చేశాడు. ఆపై స్నేహితురాలిపై కన్నేశాడు. అప్పటికే ఆమె ఇంకొకరిని లవ్​ చేస్తున్న విషయం తెలుసుకుని కసి పెంచుకున్నాడు. తన ప్రేమను నిరాకరించడంతో ఆమెపై కక్ష గట్టాడు. మాయమాటలు చెప్పి తన రూం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యా డిస్కషన్‍ పెరగడంతో కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. శుక్రవారం వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని రాంనగర్​లో పట్టపగలే ఈ దారుణం జరిగింది.

కాలేజీలో పరిచయంతో..

కాజీపేట విష్ణుపురికి చెందిన షాహిద్‍(25), హన్మకొండ లష్కర్‍ బజార్‍కు చెందిన మునిగాల హారతి(23) స్థానిక కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో స్నేహం ఏర్పడింది. షాహిద్​ తండ్రికి కాజీపేటలో మటన్​ షాపు ఉంది. హారతి తండ్రి ప్రతాప్‍ జనగామ జిల్లా స్టేషన్‍ఘన్‍పూర్​ పాలిటెక్నిక్​ కళాశాలలో ఔట్‍సోర్సింగ్​ పద్ధతిలో అటెండర్‍గా పనిచేస్తున్నాడు. ప్రతాప్​కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. పెద్దమ్మాయికి వివాహం కాగా.. హారతి రెండో అమ్మాయి. ప్రస్తుతం హన్మకొండలోనే ఎంబీఏ చదువుతోంది. హారతివాళ్ల ఇంటికి రెగ్యూలర్‍గా షాహిద్​ వెళ్లేవాడు. ఆమె తల్లిదండ్రులను పెద్దమ్మ, పెద్దనాన్నగా భావిస్తున్నట్లు చెప్పి వారి కుటుంబానికి దగ్గరయ్యాడు. షాహిద్​ డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. కాజీపేట విష్ణుపురిలో అతనికి సొంతిల్లు ఉన్నా ఏడు నెలల క్రితం రాంనగర్​లోని ఓ హెడ్​ కానిస్టేబుల్​ ఇంటిలో అద్దెకు దిగాడు. కాజీపేటలోని తమ మటన్​ షాపులోనే పనిచేస్తూ వారానికి రెండు మూడు రోజులు మాత్రమే రూంకి వెళ్లేవాడు. ఓనర్లకు బ్యాంక్ జాబ్​కు కోచింగ్​ తీసుకుంటున్నట్లు చెప్పాడు.

ప్రేమించలేదని..

ఫ్రెండ్స్​కావడంతో హారతి, షాహిద్​ క్లోజ్‍గాఉండేవారు. నగరంలో ఏ పని ఉన్నా కలిసే వెళ్లేవారు. ఫొటోలు దిగేవారు. కొద్దికాలంగా వరంగల్‍కు చెందిన శ్రీకాంత్​ అనే యువకుడిని హారతి ప్రేమిస్తోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పింది. షాహిద్‍కు వారి ప్రేమ విషయం నచ్చలేదు. దోస్త్​గా నటిస్తూనే తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాడు. ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఏవో మాటలు చెప్పి హారతిని తన రూంకు తీసుకెళ్లాడు. శ్రీకాంత్‍తో లవ్‍ బంద్‍ చేయాలని, తనను పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో పట్టరాని కోపంతో ఆమెపై కూర్చుని బయటకు సౌండ్​ రాకుండా నోరుమూసేశాడు. కత్తితో ఆమె గొంతుకొశాడు. బాగా రక్తం పోవడంతో హారతి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత షాహిద్ లొంగిపోయేందుకు నేరుగా వరంగల్​ సెంట్రల్​ జైలుకు వెళ్లి తాను హత్య చేశానని చెప్పాడు. అది విన్న అక్కడి సిబ్బంది ఘటన జరిగిన సుబేదారి పోలీస్‍స్టేషన్‍కు వెళ్లాలని చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన షాహీద్​ తాను ఫలానా ఇంట్లో ఒకరిని హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు.

ఇంటిపక్కొళ్లకు తెలియలే..

సుబేదారి పోలీసులు షాహిద్​ చెప్పింది నిజమో కాదో.. తెలుసుకోడానికి అతన్ని వెంటతీసుకుని రాంనగర్​ వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న హారతిని చూశారు. అప్పటికిగాని పక్కింట్లో ఉండేవారికి, ఇంటిపైభాగంలో ఉండే ఓనర్లకు విషయం తెలియదు. ఘటనా స్థలంలో సాక్షాధారాలను సేకరించిన పోలీసులు.. హారతి డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ఎంజీఎం హస్పిటల్‍కు తరలించారు. కాగా, ప్రతాప్​ కొడుకు నాలుగేండ్ల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి హారతినే అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కూతురు కూడా చనిపోవడంతో ప్రతాప్ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. హారతి కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్​ పరామర్శించారు.

Latest Updates