8 నెల‌ల చిన్నారి.. ఏడేళ్ల అన్న‌కు క‌రోనా.. తాత నుంచి సోకిన వైర‌స్

దేశంలోనే అతి చిన్న వ‌య‌సు చిన్నారికి క‌రోనా వైర‌స్ సోకింది. గురువారం జ‌మ్ము క‌శ్మీర్ లో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. అందులో శ్రీన‌గ‌ర్ లోని నోతిపొరా ప్రాంతానికి చెందిన 8 నెల‌ల ప‌సికందు ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డాడు. అలాగే ఆ ప‌సివాడు అన్న ఏడేళ్ల బాలుడికి కూడా క‌రోనా సోకింది. ఈ చిన్నారుల‌కు వారి తాత (57 ఏళ్లు) నుంచి వైర‌స్ వ‌చ్చింద‌ని వైద్యులు తెలిపారు. ఆ పిల్ల‌ల తాత‌ ఇటీవ‌లే సౌదీ నుంచి వ‌చ్చాడు. అత‌డికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా.. వైర‌స్ సోకిన‌ట్లు మార్చి 24న తేలింది. ఆ ప‌సికందుల‌కు క‌రోనా సోక‌డంతో త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. త‌మ బిడ్డ‌ల‌ను కాపాడాల‌ని డాక్ట‌ర్ల‌ను వేడుకున్నారు. అయితే ఆ ఇంట్లో ఇప్ప‌టికే ముగ్గురికి క‌రోనా సోక‌డంతో ఫ్యామిలీ మొత్తాన్ని హోం ఐసోలేష‌న్ లో ఉంచి డాక్ట‌ర్లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ రోజు న‌మోదైన రెండు కరోనా కేసుల‌తో కలిపి జ‌మ్ము క‌శ్మీర్ లో మొత్తం వైర‌స్ సోకిన వాళ్ల సంఖ్య 13కు చేరింది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గురువారం రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యానికి దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 718కి చేరింది. అందులో 13 మంది మ‌ర‌ణించ‌గా.. 45 మంది చికిత్స అనంత‌రం పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇవాళ కేర‌ళ‌లో అత్య‌ధికంగా 19 కేసులు న‌మోదు కాగా.. మొత్తం సంఖ్య 137కి చేరింది. సాయంత్రం వ‌ర‌కు అత్య‌ధిక కేసుల‌తో ఉన్న మ‌హారాష్ట్ర రెండో స్థానానికి చేరింది. మ‌హారాష్ట్ర‌లో 125, క‌ర్ణాట‌క‌లో 55, తెలంగాణ‌లో 44, గుజ‌రాత్ లో 43 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఏపీలో 10 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో తొలి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాడు.

Latest Updates