యూత్ ఇంట్రెస్ట్ : పీజీ వద్దు జాబే బెస్ట్

హైదరాబాద్‍, వెలుగుఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‍, ఫార్మసీ (ఎంఈ/ఎంటెక్‍/ఎంఫార్మసీ/ఎంఆర్క్) లలో పీజీ కోర్సులు చేసేందుకు ఏటా పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇంజినీరింగ్ కామన్‍ ఎంట్రన్స్ టెస్ట్(పీజీఈసెట్‍) పరీక్షను నిర్వహిస్తున్నారు. కానీ ఏటా ఇంజినీరింగ్‍ పీజీ కోర్సులను చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఎంటెక్‍ కోర్సులు చేసినప్పటికీ సరైన ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడం, టీచింగ్‍ ఫీల్డ్ ఉద్యోగాలు మాత్రమే చేయాల్సిరావడం తదితర కారణాలతో ఏటా ఎంటెక్‍, ఎంఫార్మసీ సీట్లు మిగులుతున్నాయి. బీఈ, బీటెక్‍, బీఫార్మసీ కోర్సులు చేసిన వారిని ఎంపిక చేసుకోవడానికి దేశీయ, ఎంఎన్‍సీ కంపెనీలు ఆసక్తి చూపడంతో ఇంజినీరింగ్‍లో పీజీ కోర్సులను చేసేందుకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు. పీజీ చేసి రెండేళ్ల సమయాన్ని వృథా చేసుకునే బదులు ఉద్యోగం చేరి అనుభవం సంపాదించడానికి విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని ఫలితంగా ఏటా ఇంజినీరింగ్‍ పీజీ అందించే కాలేజీలు, వాటిల్లో అందుబాటులో ఉండే సీట్లు తగ్గుతూ వస్తున్నాయి.

స్వచ్ఛందంగా వదులుకుంటున్నారు

2015లో 313 కాలేజీలలో 21750  ఎంటెక్‍, ఎంఫార్మసీ సీట్లు అందుబాటులో ఉంటే కేవలం 11576 మంది మాత్రమే పీజీ కోర్సుల్లో చేరారు. దీంతో ఆ ఏడు 10174 సీట్లు మిగిలాయి. ఆ తర్వాత పలు కాలేజీలు స్వచ్ఛందంగా సీట్లను తగ్గించుకున్నాయి. ఇంజినీరింగ్‍ పీజీ కోర్సులను నిర్వహించలేమని 46 కాలేజీలు తదుపరి అకడమిక్‍ ఇయర్‍లో కౌన్సెలింగ్‍లో పాల్గొనలేదు. 2016లో 267 కాలేజీలు మాత్రమే కౌన్సెలింగ్‍లో పాల్గొన్నాయి. 15577 పీజీ సీట్లను అందుబాటులో  ఉంచగా 8484 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ దెబ్బకు 2017 అకడమిక్‍ ఇయర్‍కు కేవలం 168 కాలేజీలు మాత్రమే ఇంజినీరింగ్‍ పీజీ, ఎంఫార్మసీ కోర్సులను కొనసాగించేందుకు నిర్ణయించాయి. సీట్ల సంఖ్య కూడా సగానికి పడిపోయి 8374 కు చేరింది. ఆ ఏడు 7523 సీట్లు భర్తీ అయ్యి  ఫర్వాలేదనిపించాయి. 2018లో 242 కాలేజీల్లో 8967 సీట్లలలో 7185 మంది విద్యార్థులు చేరారు.

ఎస్సీ/ఎస్టీలు పరీక్షకు హాజరైతే చాలు..

ఈ ఏడు పీజీఈసెట్ పరీక్షలను రాసేందుకు 10779 మంది అప్లై చేసుకున్నారు. గతేడాది 25057 మంది పరీక్షను రాయడం గమనార్హం. రూ.10వేల ఫైన్‍తో మే 25లోపు పరీక్ష ఫీజును చెల్లించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‍ చేసుకునేందుకు పరీక్ష ఫీజుగా రూ. 1000 నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీలు రూ.500 చెల్లిస్తే చాలు.   పీజీఈసెట్ పరీక్ష మే 28 నుంచి 31 వరకు 19 సబ్జెక్టులలో నిర్వహించనున్నారు. పరీక్ష 2 గంటలపాటు ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్నింగ్‍ సెషన్‍, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇవెనింగ్‍ సెషన్‍లలో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష టైం కంటే గంటన్నర ముందునుంచే  ఎగ్జామ్‍ సెంటర్‍లోకి విద్యార్థులను అనుమతిస్తారు. కంప్యూటర్ బేస్‍డ్‍ టెస్ట్(సీబీటీ)లో జరిగే పరీక్షలో 120 మల్టీపుల్ క్వశ్చన్స్ కు ఆన్సర్‍ చేయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1 మార్కును కేటాయించారు. ఎస్సీ/ఎస్టీలకు మినిమం అర్హత మార్కులు లేవు. కానీ ఇతరులు మాత్రం అర్హత సాధించేందుకు 30 మార్కులను తెచ్చుకోవాల్సి ఉంటుంది.

Latest Updates