దాచుకుని కంటున్నారు.. కావాలనుకున్నప్పుడే పిల్లలు

  • ఎగ్స్‌‌, ఎంబ్రియో ప్రిజర్వేషన్‌ తో
  • మైనస్‌ 195 డిగ్రీల సెల్సియస్‌లో నైట్రోజన్‌ లిక్విడ్‌లో పెడతరు
  • ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో పాతదే..
  • హైదరాబాద్ లోనూ నయా ట్రెండ్
  • సాప్ట్‌ వేర్స్‌ నుంచి డైవోర్స్‌ విమెన్స్‌ దాకా ఈ బాటలోకి
  • తప్పనిసరి పరిస్థితుల్లోనే పాటించాలంటున్న డాక్టర్లు

‘‘ మానస వయసు 34. ఓ కార్పొరేట్ కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌‌. ఆమె తండ్రి చనిపోవడంతో చెల్లి, తమ్ముళ్ల బాధ్యత తీసుకుంది. కొన్నేళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు చేసుకుందామని ట్రై చేస్తుంటే సరిజోడు దొరకడం లేదు. దీంతో ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అవ్వొచ్చనే ఆలోచనతో డాక్టర్‌‌ను సంప్రదించింది. తన ఎగ్స్‌‌ ప్రిజర్వ్ చేసుకుంది.’’

‘‘ ప్రశాంత్‌ , సౌమ్యలకు లేట్‌‌గా మ్యారేజ్‌ అయింది. పిల్లల కోసం కొంత కాలం వెయిట్‌‌ చేద్దామని ప్లాన్‌‌ చేసుకున్నారు. ముందుగా ఎగ్స్‌‌,స్పెర్మ్‌‌ స్టోర్‌‌ చేసుకుందామనుకున్నారు. డాక్టర్‌‌ వద్దకు వెళ్లారు. ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోను ప్రిజర్వ్ చేసుకున్నారు.’’

‘‘ కీర్తి వయసు 36. ఓ కార్పొరేట్ కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్. పెళ్లయిన ఐదేండ్ల తర్వాత భర్తతో విడిపోయి డైవోర్స్‌‌ తీసుకుంది. మళ్లీ పెళ్లి చేసుకోమని ఆమె పేరెంట్స్ ఒత్తిడి చేయడంతో ఓకే చెప్పింది. కానీ ఒకసారి డైవోర్స్‌‌ కావడంతో సూటబుల్ పర్సన్ కోసం వెతుకుతుండగా దొరకడం లేదు. దీంతో ఏజ్‌ పెరిగిపోతుండడంతో డాక్టర్‌‌ వద్దకు వెళ్లిం ది. తన ఎగ్స్ (అండాలు) ప్రిజర్వ్ చేసుకుంది.’’

హైదరాబాద్‌‌, వెలుగు: చదువు..ఉద్యోగం తర్వాతే పెళ్లి ఇది నేటి యూత్‌ మాట. బాగానే ఉంది. కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఐవీఎఫ్‌, ఐయూఐ, సరోగసీలాంటి పద్ధతులున్నాయి. ఇప్పుడు మరో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అదే ఎగ్‌, ఎంబ్రియో ప్రిజర్వేషన్‌. వీటిని మైనస్ 195 డిగ్రీల ఉష్ణో గ్రత వద్ద నైట్రోజన్ ద్రావణంలో దాస్తారు. ఈ స్థితిలో ఏ పదార్థాన్ని ఉంచినా పాడవకుండా ఉంటుంది. దీన్నే ఇప్పుడు సిటీ జనాలు ఫాలో అవుతున్నారు. పెళ్లయినా వెంటనే పిల్లలు వద్దనుకునే వారు, చిన్న వయసులో విడాకులు తీసుకున్న మహిళలు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ప్రిజర్వేషన్‌కు వెళుతున్నారు. తప్పనిసరైతేనే ఈ సిస్టమ్‌ ఫాలో కావాలని, లేకపోతే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయంటున్నారు డాక్టర్లు.

ఈ టెక్నాలజీతో ఏ వయసులోనైనా పిల్లలు పుట్టే చాన్స్‌‌ ఉంది. టెస్ట్‌‌ ట్యూబ్‌‌ బేబీ నుంచి సరోగసి పద్ధతులు ఇప్పటికే అందుబాటులో ఉండగా, రీసెంట్ గా మరో టెక్నాలజీ పద్ధతిపై లేట్ గా మ్యారేజ్ అయిన యువతులు, దంపతులు, డైవోర్స్‌‌ విమెన్స్‌‌ ఇంట్రస్ట్‌‌ చూపిస్తున్నారు. ఎగ్స్(అండాలు), స్పెర్మ్‌ (వీర్యం) ను ప్రిజర్వ్ చేసుకునే పద్ధతితో పాటు ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోను(పిండం) స్టోర్ చేసుకుంటున్నారు. ఇలా కూడా దాచుకోవచ్చా? అని ఆశ్చర్యపోతున్నారా..? ఎస్ మెడికల్ హబ్ గా డెవలప్‌‌ అవుతున్న సిటీలో ఇప్పుడిప్పుడే ఈ నయా ట్రెండ్ ను కొందరు ఫాలో అవుతున్నారు. ఈ పద్ధతి ఏంటో తెలుసుకోందాం.

ప్రెగ్నెన్సీ లేట్‌గా కావాలనుకుంటే..
ప్రస్తుతం30 ఏళ్లు దాటితేనే కానీ మొదటి ప్రెగ్నెన్సీకి వెళ్లడం లేదు కొందరు దంపతులు. ఇక సెకండ్ ప్రెగ్నెన్సీకి మరింత లేట్ అవుతుంది. దీంతో భార్యాభర్తలు అండర్ స్టాండింగ్ తో ముందుగానే ఎంబ్రియోను ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. భార్య నుంచి ఎగ్స్, భర్త నుంచి స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్
చేసి ఎంబ్రియోను ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారు.
ఖర్చు కూడా ఎక్కువే..
ప్రిజర్వ్ చేసుకుంటే ఎన్నేళ్ల తర్వాత అయినా వాడుకోవచ్చు. ఇక ఖర్చు విషయానికి వస్తే కలెక్ట్ చేసుకుంటే ఒక రేటు ఉంటుంది. ఇయర్‌‌ వైజ్‌‌గా రెన్యూవల్ కు మరో ధర చెల్లించాలి. ఇంజక్షన్స్ ఇచ్చి ఎగ్స్ ను కలెక్ట్ చేసుకుంటే లక్షన్నర రూపాయిల వరకు ఖర్చవుతుంది. మగవారి స్పెర్మ్ కలెక్ట్ చేసుకున్నందుకు రూ.10 వేలు తీసుకుంటారు. అయితే ఎగ్, స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్ ద్వారా చేసిన ఎంబ్రియోను స్టోర్‌‌ చేస్తే రూ.2 లక్షల వరకు అవుతుంది. ఇక వీటికి ప్రతి ఏడాది రెన్యూవల్ ఫీజుగా రూ.20 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
పది శాతమే…
డాక్టర్స్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్‌‌, డైవర్స్‌‌ తీసుకున్న వారు, హెల్త్ ప్రాబ్లమ్స్‌‌ ఉన్న వారు ప్రిజర్వేషన్ చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. లేట్ మ్యారేజ్ చేసుకుంటున్న వారిలో కూడా10 శాతం మంది ఇటువైపు ఆలోచన చేస్తున్నారు. వీరు గూగుల్ లో సెర్చ్‌‌ చేయడం, లేదా కొలిగ్స్‌‌ నుంచి తెలుసుకొని డాక్టర్స్ వద్దకు వెళ్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే ముందుకు రావాలని డాక్టర్లు పేర్కొంటున్నారు. మరోవైపు ఇలాంటి పద్ధతులతో సమాజం ఎటు పోతుంది అంటూ సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఎందుకు చేస్తున్నారంటే..?
అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో సైన్స్ పరంగా ఏది అసాధ్యం కాదు. అందుకే ప్రస్తుతం చాలామంది మహిళలు
తమ ఎగ్స్ ను దాచుకుంటున్నారు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గుతుంది. కాబట్టి 30 ఏళ్లు అటు ఇటుగా ఉన్నవారు ఎగ్స్ ను ప్రిజర్వ్ చేయమని డాక్టర్స్ వద్దకు వెళ్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఇలా ఎందుకంటే 30 ఏళ్లకు ఎగ్స్ ను తీసి స్టోర్ చేస్తే.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని, 35 ఏళ్లకు అటు ఇటుగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే మహిళకు 35 ఏళ్లు వచ్చినా, ఎగ్స్ కు 30 ఏళ్లే ఉంటుంది. ఇలా ఎగ్స్ ను ప్రిజర్వ్ చేసుకుంటున్న వారిలో డైవోర్స్‌‌ తీసుకున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ కావడంతో సెకండ్ మ్యారేజ్ కు ఆచితూచి అడుగులు వేయడంతో చాలా లేట్ అవుతుంది. దీంతో 35 ఏళ్లు దాటితేనే కానీ సెకండ్ మ్యారేజ్ కావడం లేదు. ఇలా డైవోర్స్‌‌ విమెన్స్‌‌ ప్రిజర్వేషన్స్ కు ముందుకొస్తున్నారు. మరోవైపు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్న మహిళలు కూడా ప్రిజర్వ్ కు ఇంట్రస్ట్‌‌ చూపుతున్నారు.

లేట్‌ మ్యారేజెస్‌ తోనే…
ప్రస్తుతం లేట్ మ్యారేజ్‌‌ల ట్రెండ్ కొనసాగుతుంది. లైఫ్ లో సెటిల్ అయ్యే వరకూ చేసుకోవడం లేదు. ఇది మగాళ్లకే పరిమితం కాలేదు. చాలామంది యువతులు కూడా 30 ఏళ్లు దాటితేనే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. లేట్ గా మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. మరోవైపు కొందరు దంపతులు
ఫ్యామిలీ ప్లానింగ్ అంటూ రెండు, మూడేళ్ల దాకా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికీ అటు ఇటుగా 34..35 ఏళ్లకు గానీ పిల్లలను కనేందుకు ఇంట్రస్ట్‌‌ చూపిస్తున్నారు. అయితే 30 ఏళ్లు దాటితేనే మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇక 37 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే మరింతగా సమస్యలు ఉంటాయి. ఇక 40 దాటితే 10 శాతం వరకు మాత్రమే ప్రెగ్నెన్సీ అవకాశాలు. ఇలా వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఎగ్స్ ఉత్పత్తితో పాటు క్వాలిటీ కూడా తగ్గుతుంది.

నేచురల్ గా జరిగితేనే మేలు
భార్యా భర్తలు వేర్వేరు చోట్ల ఉంటుంటారు. ఇక విదేశాల్లో ఉంటే రాలేరు. దీంతో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ల్యాబరేటరీలో స్టోర్ చేసుకుంటున్నారు. ఇదే కాదు క్యాన్సర్ డిడెక్ట్‌‌ అయినప్పుడు కూడా ఎగ్స్, స్పెర్మ్ దాచుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్స్, స్పెర్మ్‌ , ఎంబ్రియోలను ప్రిజర్వ్ చేసుకోవడం కూడా ట్రెండ్‌‌గా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీలో 20 ఏళ్లు కిందటి నుంచే ఫాలో అవుతున్నారు.
హైదరాబాద్ లో మాత్రం ఈ ట్రెండ్ కొద్ది నెలల కిందటే మొదలైంది. అయితే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా స్టోర్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ సోషల్ గా ప్రాబ్లమ్స్ ఉండి ఎగ్ ఫ్రీజింగ్ కు వస్తే మంచిది కాదు. ఎగ్స్ ను ఏ వయసులో తీసుకుంటున్నా, తర్వాత మహిళ బాడీలో చాలా మార్పులు జరుగుతాయి. షుగర్, బ్లడ్ ప్రెజర్, పీసీఓడీ.. ఇలా ఎన్నో హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. అయితే ఏ వయసులో చేసుకోవాల్సిన ముచ్చట ఆ
వయసులోనే నేచురల్‌‌గా జరగాలంటూ డాక్టర్లు సూచిస్తున్నారు.

 

 

Latest Updates