వైరల్: ఫన్నీ వెడ్డింగ్ కార్డ్.. కట్నాలు, బరాత్ ఆన్‌‌లైన్‌లోనే! 

వైరల్: ఫన్నీ వెడ్డింగ్ కార్డ్.. కట్నాలు, బరాత్ ఆన్‌‌లైన్‌లోనే! 

హైదరాబాద్: కరోనా కష్టకాలంలో నలుగురు ఓ చోట గుమిగూడాలన్నా భయమేస్తోంది. ఎక్కడ వైరస్ సోకుతుందోనని అందరూ గుబులు పడుతున్నారు. ఇక దావత్‌లు, పెళ్లిళ్ల ముచ్చట లేనే లేదు. కానీ ప్రముఖ యూట్యూబర్, మై విలేజ్ షో ఫేమ్ అనిల్ జీల కరోనా టైమ్‌లో షాదీ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అబ్బా.. దీంట్ల పెద్ద విశేషం ఏముందనుకుంటున్నారా? పెళ్లి చేసుకొనుడు పెద్ద ముచ్చట కాకపోవచ్చు గానీ అనిల్ తన వెడ్డింగ్ కార్డ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అని పెళ్లి పత్రికపై రాసి ఉండటం విశేషం. శానిటైజర్ ఫస్టు, మాస్క్ మస్టు, సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అంటూ క్యాప్షన్స్‌‌తో మెసేజ్ ఇస్తూ దీన్ని డిజైన్ చేశారు. 

ఇకపోతే, వధూవరులకు కరోనా నెగిటివ్ అని కూడా పత్రికలో పేర్కొనడం గమనార్హం. పెండ్లిని ఆన్‌‌లైన్‌లో చూసి ఆశీర్వదించాలని, విందు మాత్రం ఎవరింట్లో వారే తినాలని.. బరాత్ కూడా ఉందని, కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగరాలని చెబుతూ ఈ కార్డ్‌‌ను ఫన్నీగా రూపొందించారు. అలాగే కట్నాలు వేయాలనుకునే వారు ఫోన్ పే, గూగుల్ పే చేయొచ్చునని.. ఇలా వసూలైన మొత్తాన్ని కరోనాతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయంగా అందిస్తామని పత్రికలో చెప్పడం ఆకట్టుకుంటోంది. ఈ పెళ్లిని మై విలేజ్ షో టీమ్ లైవ్‌లో కవర్ చేస్తుందని రాసున్న ఈ క్రియేటివ్ పెళ్లి పత్రిక నెట్‌‌లో వైరల్ అవుతోంది.