సీఎం గా ప్రమాణ స్వీకారం చేయకముందే అధికారులతో చర్చలు..

ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ (సోమవారం) బిజీగా గడిపారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయకున్నా… పాలనా వ్యవహారాలపై అధికారులతో చర్చించారు. వివిధ విభాగాలకు చెందిన ఆధికారులతో భేటీ అయ్యారు. తర్వాత జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్నారు.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలను నివేదించారు. కేంద్రం నుంచి సాయం అందించాల్సిందిగా ప్రధానిని కోరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా భేటీ అయ్యారు. సోమవారం ప్రత్యేక విమానంలో గన్నవరంకు వచ్చిన వైఎస్‌ జగన్‌.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

ఈ నెల 30వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని  పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కలిశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించారు.

రేపు(మంగళవారం), ఎల్లుండి తిరుమలలో పర్యటించబోతున్నారు వైఎస్ జగన్. రేపు సాయంత్రం ఐదు గంటలకు జగన్‌ తిరుమల చేరకుంటారు. రాత్రి తిరుమలలోనే ఆయన బస చేస్తారు. మరుసటి రోజు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. తర్వాత అక్కడినుంచి కడప వెళ్తారు. కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించనున్నారు. ఆ తర్వాత పులివెందుల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ సందర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత మొదటి సారిగా ఆయా ప్రాంతాలకు జగన్‌ వస్తుండడంతో ఘన స్వాగతం చెప్పేందుకు స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest Updates