YSR కాంగ్రెస్ పిలుపు : సోమవారం ఏపీ బంద్

హోదాపై కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. జూలై 24వ తేదీ సోమవారం రాష్ట్రంలో బంద్ నిర్వహించాలని.. అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్యాకేజీ నుంచి యూటర్న్ తీసుకుని హోదా కోసం ఉద్యమిస్తున్న టీడీపీ ఎంపీలు కూడా బంద్ కు కలిసిరావాలని కోరారు. రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు అందరం ఒకే వేదిక ద్వారా దీక్ష చేస్తే.. కేంద్రం కదిలి వస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే మా పార్టీ ఏకైక డిమాండ్ అని.. హోదా ఇచ్చే పార్టీలకే కేంద్రంలో మద్దతు ఇస్తామని ప్రకటించారు.

నాలుగేళ్లుగా మేము మాట్లాడిన మాటలే గల్లా జయదేవ్ లోక్ సభలో చెప్పారన్నారు. నాలుగేళ్లుగా మేము చెబుతుంటే మమ్మల్ని వెక్కిరించినోళ్లే.. ఇప్పుడు అవే మాటలను వినిపిస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? అన్నారు.. హోదా ఏమన్నా సంజీవనా అన్నారు.. హోదాకు రాయితీలకు సంబంధం లేదని మహానాడు లో తీర్మానం చేసిన విషయాలను గుర్తు చేశారు. ఉనికికోసం ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని.. అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని పదేపదే పొగిడిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని.. టీడీపీకి గుణపాఠం చెప్పేరోజులు దగ్గరల్లోనే ఉన్నాయన్నారు. హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని అసెంబ్లీలో తీర్మానాలు చేసిన విషయం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. సోమవారం బంద్ కు హోదా కోసం పోరాడే అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Posted in Uncategorized

Latest Updates