లిక్క‌ర్ సేల్స్ కి అనుమ‌తిచ్చిన కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌రేం?

ద‌శ‌ల వారీగా మ‌ద్యపాన నిషేధం చేస్తామ‌ని త‌మ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. త‌మ విధానంలో మార్పులేద‌ని చెప్పారాయ‌న‌. ధ‌రలు పెంచడం ద్వారా మ‌ద్య‌పానాన్ని కంట్రోల్ చేస్తామ‌ని ఎన్నిక‌ల ముందే చెప్పామ‌ని అన్నారు. కేంద్రం ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డంతోనే దాదాపు నెల‌న్న‌ర‌ త‌ర్వాత లిక్క‌ర్ షాపులు ఓపెన్ చేశామ‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వ మ‌ద్య విధానంపై ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని అంబ‌టి త‌ప్పుబ‌ట్టారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతులతో లిక్కర్ అమ్మితే చంద్రబాబు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లిక్కర్ అమ్మకంపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించ‌లేక‌పోతున్నార‌ని అడిగారు.

చంద్ర‌బాబుకు అర్హ‌త లేదు..

ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేస్తే చంద్రబాబు తూట్లుపొడిచి.. రాష్ట్రంలో మ‌ళ్లీ మ‌ద్యం అమ్మ‌కాలు మొద‌లుపెట్టార‌ని అన్నారు అంబ‌టి. ఆ విష‌యాల‌ను ప్రజలు మర్చిపోయార‌ని చంద్రబాబు అనుకుంటున్నార‌ని, అందుకే త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. మీడియాలో ప్ర‌చారం కోస‌మే ఆయ‌న డ్రామాలాడుతున్నార‌ని ఆరోపించారు. చంద్రబాబుకు మద్యపాన నిషేధం గురించి మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మద్యం తాగొద్దని చెప్పాల్సిన చంద్రబాబు బ్రాండ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్ర‌శ్నించారు.

ఒక్క రోజైనా పొగిడారా?

క‌రోనా టెస్టుల్లో దేశంలోకెల్లా ఏపీ తొలి స్థానంలో ఉంద‌ని, వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఏ ఒక్క‌రోజైనా చంద్ర‌బాబు పొగిడారా అని ప్ర‌శ్నించారు అంబ‌టి రాంబాబు. చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చి హైద‌రాబాద్ లో ఉండ‌డానికి కాద‌ని అన్నారు. ఆయ‌న‌ ఎక్క‌డో కూర్చుని జూమ్ లో సందేశాలు ఇస్తున్నారన్నారు. క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు హైద‌రాబాద్ ఉంటారా అని అడిగారు. వ‌ల‌స ‌కూలీలు, విద్యార్థులు రాష్ట్రానికి వ‌స్తున్నార‌ని, చంద్ర‌బాబు కూడా వ‌చ్చి క‌ర‌క‌ట్ట నివాసంలో క్వారంటైన్ లో ఉండాల‌ని చంద్ర‌బాబుకు సూచించారు. హెరిటేజ్ లో ప‌ని చేసే ఉద్యోగికి కరోనా సోకితే ఎందుకు దాస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Latest Updates