ఆటగాళ్లలో భయాన్ని పోగొట్టండి : యువరాజ్

ముంబై: ఎమ్మెస్కే ప్రసాద్‌‌ నేతృత్వంలోని ప్రస్తుత సెలెక్టర్ల కమిటీ కన్నా మంచి సెలెక్టర్లు కావాలని టీమిండియా మాజీ క్రికెటర్‌‌‌‌ యువరాజ్‌‌ సింగ్‌‌ అభిప్రాయపడ్డాడు. ఎమ్మెస్కే కమిటీ ఆలోచనలు ఈ తరం క్రికెట్‌‌ మార్క్‌‌ను అందుకోవడం లేవన్నాడు. ‘మనకు మంచి సెలెక్టర్ల అవసరం కచ్చితంగా ఉంది. అయితే ఈ సెలెక్టర్ల జాబ్‌‌ అంత సులువైనది కాదు. 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తే మరో 15 మంది విషయం ఏంటనే చర్చ నడుస్తుంది. ఇదో కఠినమైన జాబ్‌‌. కానీ ప్రస్తుత కమిటీ ఆలోచనలు ఈ తరం క్రికెట్‌‌ మార్క్‌‌ను అందుకునేలా లేవు. నేనెప్పుడు ఆటగాళ్లకు రక్షణగా.. సానుకూల దృక్పథంతో వారికి ఫేవర్‌‌‌‌గా ఉంటా. ప్లేయర్ల గురించి నెగిటివ్‌‌గా మాట్లాడితే జట్టును అర్థం చేసుకోలేనట్టు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆటగాళ్లలో స్పూర్తి నింపాలి. బ్యాడ్‌‌ టైమ్‌‌లో ప్రతి ఒక్కరు చెత్తగానే మాట్లాడుతారు. మనకైతే మంచి సెలెక్టర్లు కావాల్సిందే.’ అని తెలిపాడు. ఇక ఆట నుంచి కాస్త విరామం తీసుకుంటే జట్టులో చోటు కోల్పోతామనే ఆటగాళ్ల భయాన్ని పోగొట్టాలని యువరాజ్‌‌ సూచించాడు. ఈ భయంతోనే ఆటగాళ్లు గాయాలైనా, ఇబ్బందులున్నా ఆటను కొనసాగిస్తున్నారని తెలిపాడు.

 

Latest Updates