అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ రిటైర్మెంట్..?

టీమిండియా సీనియర్ ఆటగాడు, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. అందుకు సంబంధించి బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాడు. రిటైర్మెంట్‌ తర్వాత ఐసీసీ అనుమతి పొందిన ఇతర దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడేందుకు యువరాజ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్ తరపున ఇక ఆడబోనని యువరాజ్‌కు అర్ధం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని.. బీసీసీఐ నుంచి సరైన సమాచారం వచ్చాక తనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇటీవల ఇర్ఫాన్‌ పఠాన్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడేందుకు సమర్పించిన దరఖాస్తును బీసీసీఐ తిరస్కరించింది.

మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొదట్లో అవకాశాలు వచ్చినా.. ఆ తర్వాత రిజర్వ్ బెంచ్‌కే యూవీ పరిమితమయ్యాడు. దీంతో తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.  ఇదిలా ఉండగా యూవీకి ఇప్పటికే కెనడా, యూరప్‌లలో జరిగే టీ20 లీగ్‌ మ్యాచుల్లో ఆడేందుకు భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

Latest Updates