‘జీ‘ కి మరిన్ని చిక్కులు

న్యూఢిల్లీ: ప్రమోటర్‌‌ సుభాష్‌‌ చంద్ర రాజీనామా అనంతరం వార్తల్లోకి వచ్చిన జీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ లిమిటెడ్‌‌కు (జీల్‌‌) కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా సుబోధ్‌‌ కుమార్‌‌, నిహారికా వోహ్రా అనే ఇద్దరు ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్లు కంపెనీ రాజీనామా చేయడం, కొన్ని ఆరోపణలు లేవనెత్తడం వల్ల కంపెనీకి సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌‌ఆర్‌‌) నిధులను సొంత అసోసియేషన్‌‌ కోసం ఖర్చు చేయడం సహా కంపెనీలో పలు అక్రమాలు జరిగాయని వోహ్రా, కుమార్‌‌ ఆరోపించారు. దీంతో సెబీతోపాటు కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసీఏ) రంగంలోకి దిగాయి. సీఎస్‌‌ఆర్‌‌ నిధుల అక్రమాలపై ఎంసీఏ విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఆర్‌‌ఎస్‌‌ నిధులను జీ తన సొంత అసోసియేషన్‌‌ కోసం వాడినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని, ఇదే నిజమని తేలితే కంపెనీపై చర్యలు తప్పవని ఎంసీఏ వర్గాలు తెలిపాయి. మాజీ డైరెక్టర్ల ఆరోపణలపై జీ స్పందిస్తూ చట్ట ప్రకారమే సీఎస్‌‌ఆర్‌‌ నిధులు వాడామని, అవసరమైన సర్టిఫికేషన్‌‌ను కూడా పొందామని వివరణ ఇచ్చింది.

జీ నుంచి కంటెంట్‌‌ పొందిన డిష్‌‌ టీవీ, సిటీ కేబుల్‌‌ బకాయిలు చెల్లించకున్నా పట్టించుకోలేదని కుమార్‌‌, వోహ్రా లేవనెత్తిన ఆరోపణల సంగతి చూడాలని సెబీ భావిస్తున్నట్టు తెలిసింది. డెఫినెటివ్‌‌ ప్లాన్‌‌ ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని జీల్‌‌ తెలిపింది. ప్రమోటర్‌‌ లోన్ల కోసం బ్యాంకు గ్యారంటీని వాడుకున్నారని ఈ మాజీ డైరెక్టర్లు మరో బాంబు పేల్చారు. దీనిపై సంబంధిత బ్యాంకుకు నోటీసులు ఇచ్చామని జీల్‌‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఫిల్మ్‌‌ అడ్వాన్సుల కోసం రూ.2,200 కోట్లు  ఇచ్చారన్న ఆరోపణలకు బదులిస్తూ ఈ విషయాన్ని వార్షిక రిపోర్టులో వెల్లడించామని, ఇన్వెస్టర్ల సమావేశాల్లోనూ ప్రకటించామని పేర్కొంది.

వివరణ కోరిన బీఎస్‌‌ఈ

మాజీ ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్ల ఆరోపణలపై ఒక ఎనలిస్టు స్పందిస్తూ వీటిపై కంపెనీ ఇచ్చిన వివరణలు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేవని అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణల వల్ల జీల్‌‌ ప్రతిష్ట బాగా దెబ్బతిందని వ్యాఖ్యానించారు. వీళ్లు రాసిన ఒరిజినల్‌‌ లెటర్లను కంపెనీ బయటపెడితే బాగుంటుందని అన్నారు. సుభాష్‌‌ చంద్రతోపాటు వోహ్రా, కుమార్‌‌ రాజీనామాలతో జీల్‌‌ షేర్లు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఎస్‌‌ఈ కూడా జీల్‌‌ నుంచి వివరణ కోరడంతో కంపెనీ భవిష్యత్‌‌పై మార్కెట్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ రాజీనామాలకు కారణాలేంటో చెప్పాలని బీఎస్‌‌ఈ అడిగింది. వీళ్లు అందజేసిన రాజీనామా లెటర్లను సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయంపై జీ ఇంకా స్పందించలేదు. ఆరోపణల నేపథ్యం జీల్​ షేర్లు గురువారం 3.11 శాతం పతనమై రూ.309కి చేరాయి.

మరిన్ని షేర్లు కొన్న ఓఎఫ్‌‌ఐ గ్లోబల్‌‌ చైనా

ఓఎఫ్‌‌ఐ గ్లోబల్‌‌ చైనా ఫండ్‌‌ ఎల్‌‌ఎల్‌‌సీ తమ కంపెనీలో వాటాలను పెంచుకుందని, అదనంగా 1.37 కోట్ల షేర్లను కొందని జీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ గురువారం ప్రకటించింది. ఓఎఫ్‌‌ఐకి ఇది వరకే జీలో 8.7 శాతం వాటా ఉంది. తాజా షేర్ల కొనుగోళ్లతో ఇది 10.99 శాతానికి పెరిగింది. ఇదిలా ఉంటే జీ ప్రమోటర్‌‌ కంపెనీల్లో ఒకటైన సీక్వేటర్‌‌ మీడియా సర్విసెస్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ 79,912,915 కోట్ల షేర్లను అమ్మేసింది. వీటిలో 13,749,266 షేర్లను ఓఎఫ్‌‌ఐకి అమ్మింది.

మాజీ డైరెక్టర్ల ఆరోపణలు

  •    సీఆర్‌‌ఎస్‌‌ నిధులను కంపెనీ తన సొంత అసోసియేషన్‌‌ కోసం వాడింది.
  •    జీ నుంచి కంటెంట్‌‌ పొందిన డిష్‌‌ టీవీ, సిటీ కేబుల్‌‌ బకాయిలు చెల్లించకున్నా పట్టించుకోలేదు.
  •    ప్రమోటర్‌‌ లోన్ల కోసం బ్యాంకు గ్యారంటీని వాడుకున్నారు.
  •     గత ఆర్థిక సంవత్సరంలో ఫిల్మ్‌‌ అడ్వాన్సుల కోసం రూ.2,200 కోట్లు  ఇచ్చారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.

Latest Updates