చైనాకు గుడ్‌బై చెబుతామంటున్న జిందాల్‌ గ్రూప్‌

న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో చైనా దిగుమతులను జీరోకి తగ్గించుకుంటామని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ గ్రూప్‌ ఏడాదికి 400 మిలియన్‌ డాలర్ల మేర చైనా నుంచి దిగుమతులు చేసుకుంటోంది. వీటిని జీరోకి తగ్గిస్తామని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌‌ పార్థ్‌ జిందాల్‌ గురువారం అన్నారు. జేఎస్‌డబ్యూ గ్రూప్‌ ఓనర్‌‌ సజ్జన్‌ జిందాల్‌ కుమారుడే ఈ పార్థ్‌ జిందాల్‌. ఈ గ్రూప్‌ స్టీల్‌, ఎనర్జీ, సిమెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలకమైన సెక్టార్లలో వ్యాపారాలు చేస్తోంది. చైనా నుంచి ఈ గ్రూప్‌ ఎక్కువగా  స్టీల్‌, ఎనర్జీ బిజినెస్‌ల కోసం దిగుమతులు చేసుకుంటోంది. ‘భారత గడ్డ మీద మన వీర సైనికులపై చైనీస్‌ ఆర్మీ దాడులు చేయడం మనకొక మేలుకొలుపు లాంటిది. ఒక యుద్ధభేరి లాంటిది. ఏటా నికరంగా చైనా నుంచి మా జిందాల్‌గ్రూప్‌కు 400 మిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు జరుగుతున్నాయి. వీటి విలువను వచ్చే 24 నెలల్లో సున్నాకు తగ్గిస్తాం..బాయ్‌కాట్‌ చైనా’ అంటూ పార్థ్‌ జిందాల్‌ ట్విటర్‌‌ ద్వారా ప్రకటించారు.  గత ఏడు వారాల నుంచి ఇండియా, చైనీస్‌ ఆర్మీకి తూర్పు లడఖ్‌లో గొడవలు జరుగుతున్నాయి. జూన్‌ 15 న గాల్వాన్‌ వ్యాలీలో 20 మంది భారత జవాన్లను చైనీస్‌ ఆర్మీ చంపేయడంతో దేశంలో బాయ్‌కాట్‌ చైనా ప్రొడక్ట్స్‌ ఉద్యమం దేశంలో మరింత ఊపందుకుంది.

Latest Updates