ఇక లాభాల్లోకి జొమాటో…

  •     ఐదేళ్లలో వందశాతం వృద్ధి సాధిస్తాం
  •     జొమాటో సీఈఓ దీపిందర్‌‌

న్యూఢిల్లీ: కంపెనీ మొదలైనప్పటి నుంచీ నష్టాలతోనే నెట్టుకొస్తున్న ప్రముఖ ఫుడ్‌‌ డెలివరీ, రెస్టారెంట్‌‌ సెర్చ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ జొమాటో ఎట్టకేలకు లాభాల బాట పట్టనుంది. మరిన్ని కొత్త చోట్ల సేవలు అందించడం, డార్క్‌‌ కిచెన్లను మొదలుపెట్టడంతో ఏ క్షణమైనా లాభాల్లోకి వస్తామని తెలిపింది. అంతేగాక కొత్తగా వేలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలిగామని జొమాటో ఫౌండర్‌‌, సీఈఓ దీపిందర్‌‌ గోయల్‌‌ చెప్పారు. అయితే గురుగ్రామ్‌‌లోని కంపెనీ హెడ్‌‌ ఆఫీస్‌‌లో పనిచేసే 540 మంది ఉద్యోగులను శనివారం తొలగించింది. దీనిపై గోయల్ మాట్లాడుతూ కస్టమర్‌‌ సర్వీస్‌‌ అవసరం తగ్గడం వల్ల కొంతమందిని తీసేసిన మాట నిజమేనని, అయితే గతంలోకంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు. టెక్నాలజీ, ప్రొడక్ట్‌‌, డేటా సైన్సెస్‌‌ టీమ్స్‌‌ కోసం ఇప్పటికీ నియామకాలు కొనసాగుతున్నాయని గోయల్‌‌ వివరించారు. గత ఐదేళ్లలో తమ వ్యాపారం పదిరెట్లు పెరగడం వల్ల వేలాది మందికి ఉపాధి కల్పించడం సాధ్యపడిందని చెప్పారు.

2008లో మొదలైన జొమాటో ఇప్పుడు 24 దేశాల్లోని పది వేల నగరాల్లో ఫుడ్‌‌ డెలివరీ సేవలు అందిస్తోంది. మనదేశంలోని 500 నగరాల్లో 2.5 కోట్ల మందికి ఆహారం డెలివరీ ఇస్తోంది. ఎనలిస్టుల అంచనాల ప్రకారం జొమాటో వాల్యుయేషన్‌‌ 3.6 బిలియన్‌‌ డాలర్లు–4.5 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. సిలికాన్‌‌ వ్యాలీ వెంచర్‌‌ ఫండ్‌‌  సికోనియా క్యాపిటల్‌‌, టెమాసెక్‌‌ హోల్డింగ్స్‌‌, ఇండియన్ ఈ–కామర్స్‌‌ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్‌‌ జొమాటోలో ఇన్వెస్ట్‌‌ చేశాయి. ఇది 2.50 లక్షల రెస్టారెంట్ల నుంచి, డార్క్ కిచెన్ల నుంచి ఫుడ్‌‌ తెచ్చిస్తుంది. డార్క్‌‌ కిచెన్లలో వంటశాలలు మినహా ఏమీ ఉండవు. అంటే అక్కడ కస్టమర్లకు వడ్డించడం అంటూ ఏమీ ఉండదు. గత మూడు నెలల్లో తమ నష్టాలు 50 శాతం తగ్గాయని, ఏ క్షణమైనా లాభాలు మొదలుకావొచ్చని గోయల్‌‌ ప్రకటించారు.

Latest Updates