540 మందిపై జొమాటో వేటు

                టెక్నాలజీతో ఉద్యోగులకు ఎసరు

                2 నుంచి 4 నెలల జీతం ఇచ్చి ఇంటికి..

న్యూఢిల్లీ : ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ డిస్కవరీ ప్లాట్‌‌ఫామ్ జొమాటో భారీగా తన ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ హెడ్ ఆఫీస్ గూర్గావ్‌‌లోని తన కస్టమర్, మర్చంట్, డెలివరీ పార్టనర్ సపోర్ట్ టీమ్స్‌‌ నుంచి 540 మంది ఉద్యోగులను తీసేసింది. ఈ ఫుడ్ అగ్రిగేటర్‌‌‌‌ పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేయడం ఇదే మొదటిసారి. బ్యాక్ ఎండ్ సపోర్ట్‌‌ ఉద్యోగాల్లో రిడండెన్సీలను తగ్గించుకునేందుకు జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘గుర్గావ్‌‌లోని మా ఆఫీస్ సపోర్ట్‌‌ టీమ్స్‌‌ నుంచి 541 మంది(మొత్తం జొమాటో ఉద్యోగుల్లో 10 శాతం) ఉద్యోగులు కంపెనీ నుంచి బయటికి వెళ్తున్నారు’ అని కంపెనీ తెలిపింది. తీసేసిన ఉద్యోగులకు 2 నుంచి 4 నెలల పరిహార ప్యాకేజీని కంపెనీ ఆఫర్ చేసింది. కంపెనీలో పలు సెక్షన్లకు టెక్నాలజీ ఇంటర్‌‌‌‌ఫేస్‌‌ను జొమాటో అభివృద్ధి చేసింది. దీంతో కొన్ని ఉద్యోగాలు కంపెనీకి అనవసరంగా మారాయి. ‘గత కొన్ని నెలల నుంచి మా టెక్నాలజీ ప్రొడక్ట్‌‌లను, ప్లాట్‌‌ఫామ్‌‌లను గణనీయంగా అభివృద్ధి చేశాం. మా బిజినెస్‌‌లు కంటిన్యూగా వృద్ధి సాగిస్తున్నాయి. దీంతో కస్టమర్​ కేర్​ను సంప్రదించడం తగ్గిపోయింది. సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం 7.5 శాతం ఆర్డర్లకు మాత్రమే సపోర్ట్ అవసరం పడుతుంది. మార్చిలో ఇది 15 శాతంగా ఉండేది’ అని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల కోత అనంతరం ఇంటర్నేషనల్ మార్కెట్లను కలుపుకుని మొత్తంగా జొమాటోకు 5 వేల మంది ఉద్యోగులున్నట్టు అంచనా. ఈ ఏడాదిలో ఈ నెల వరకు జొమాటో కస్టమర్, మర్చెంట్, డెలివరీ పార్టనర్ సపోర్ట్ టీమ్‌‌ల నుంచి 600 మందిని తీసేసినట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.  నాన్ డెలివరీ టీమ్స్‌‌లో 1,200 మందికి పైగా రిక్రూట్ చేసుకున్నట్టు తెలిపారు. మిగిలిన 400  మందిని ఆఫ్ రోల్స్ పొజిషన్లలో నియమించుకుంది.  ఖర్చులను తగ్గించుకునేందుకు జొమాటో  2015లో 300 మంది ఉద్యోగులను తీసేసిందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Latest Updates