స్విగ్గీ, జొమాటోలో ఫుడ్​ కాస్ట్​లీనా?

zomato-swiggi-food-prices-hikes

న్యూఢిల్లీస్విగ్గీ, జొమాటోలు  రోజుకు కోట్ల సంఖ్యలో ఫుడ్‌‌‌‌ ఆర్డర్లు డెలివరీ ఇస్తున్నాయి. వీటిపై ఆధారపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే ఇక నుంచి జొమాటో, స్విగ్గీ యాప్స్ ద్వారా ఆర్డర్లు ఇస్తే జేబుపై మరింత భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సంస్థలు డిస్కౌంట్స్‌‌‌‌ను 40 శాతం వరకు తగ్గించడానికి రెడీ అవుతున్నాయి. ఎందుకంటే ఇవి ప్రతి నెల డిస్కౌంట్స్‌‌‌‌ కోసం రూ.250 కోట్ల నుంచి రూ.270 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి పాత కస్టమర్లను కాపాడుకోవడానికి డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఫలితంగా నష్టాలు పెరుగుతున్నాయి. డిస్కౌంట్లు తగ్గిస్తే కస్టమర్ల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇవి కొత్త మార్గం కనిపెట్టాయి. పైకి మాత్రం డిస్కౌంట్లు ఇస్తున్నట్టు చెబుతూనే ఉన్నా, హ్యాండ్లింగ్‌‌‌‌ చార్జెస్‌‌‌‌, పన్నులు, డెలివరీ చార్జీల పేరుతో అదనపు బాదుడు మొదలుపెట్టాయి.

ఫలితంగా కస్టమర్‌‌‌‌కు డిస్కౌంట్లు ఇచ్చినప్పటికీ ఇతర చార్జీలు వసూలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండటం లేదు. తమకు ప్రతి ఆర్డర్‌‌‌‌పైనా రూ.25 నష్టం వస్తోందని జొమాటో తెలిపింది. అయితే గత ఏడాది కంటే ఇది 43 శాతం తక్కువని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఫుడ్‌‌‌‌ డెలివరీ వ్యాపారం వల్ల దాదాపు రూ.రెండు వేల కోట్ల నష్టాలు వచ్చాయని ప్రకటించింది. డిస్కౌంట్లపై ఆధారపడటానికి బదులు కస్టమర్ల నుంచి ఆర్డర్లను, రెస్టారెంట్ల సంఖ్యను పెంచుకోవాలని ఈ రెండు సంస్థల పెట్టుబడిదారులు స్పష్టం చేశారు. డెలివరీల సంఖ్యను బాగా పెంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు.

 వెనక్కి తగ్గిన ఉబర్‌‌‌‌, ఓలా

ఓలా, ఉబర్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్ ఫుడ్‌‌‌‌ డెలివరీ మార్కెట్‌‌‌‌పై పెద్దగా దృష్టి సారించకపోవడంతో  స్విగ్గీ, జొమాటోల  వ్యాపారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉబర్‌‌‌‌, ఫుడ్‌‌‌‌పాండా కూడా డిస్కౌంట్లను భారీగా తగ్గించాయి. ఫుడ్‌‌‌‌పాండాను దక్కించుకోవడానికి ఓలా భారీగా డబ్బు ఖర్చు చేసింది. ఉబర్‌‌‌‌ ఈట్స్‌‌‌‌ను మార్కెట్లో నిలదొక్కుకునేటట్లు చేయడానికి దీని మాతృసంస్థ ఉబర్‌‌‌‌ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. నష్టాల వల్ల ఓలా మెజారిటీ నిధులను ఫుడ్‌‌‌‌పాండా నుంచి వెనక్కి తీసుకుంది. ఉబర్‌‌‌‌ ఈట్స్‌‌‌‌కు కేటాయింపులు సగానికి అంటే , రూ.835 కోట్లకు తగ్గిపోయాయి. ఇటీవలే న్యూయార్క్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్సేంజ్‌‌‌‌లో లిస్ట్‌‌‌‌ అయిన ఉబర్‌‌‌‌, ఫిబ్రవరి నుంచి కస్టమర్ల డిస్కౌంట్లను తగ్గిస్తూ వస్తోంది.  ఫుడ్‌‌‌‌ డెలివరీ వ్యాపారంలో మార్జిన్లు చాలా తక్కువ. అందుకే ఓలా ఫుడ్‌‌‌‌పాండా నుంచి మెల్లిగా తప్పుకుంటోంది. ఇతర రెస్టారెంట్ల ఫుడ్‌‌‌‌ను డెలివరీ చేయడానికి బదులు, గ్రేట్‌‌‌‌ కిచిడీ ఎక్స్‌‌‌‌పెరిమెంట్‌‌‌‌, లవ్‌‌‌‌మేడ్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎల్ఆర్టీ వంటి ప్రైవేటు లేబుల్ బ్రాండ్స్‌‌‌‌ను రూపొందిస్తున్నది. 2021 నాటికి ఇండియా ఫుడ్‌‌‌‌ డెలివరీ మార్కెట్‌‌‌‌ దాదాపు రూ.34,800 కోట్లకు చేరుతుందని రెడ్‌‌‌‌సీర్‌‌‌‌ కన్సల్టింగ్‌‌‌‌ స్టడీలో తేలింది. ఉబర్‌‌‌‌ అమెరికాలో ఐపీఓకు వెళ్లడానికి ముందే ఫుడ్‌‌‌‌ డెలివరీ వ్యాపారాన్ని స్విగ్గీకి అమ్మడానికి చర్చలు జరిపింది.

వీటి ఫలితం వివరాలు మాత్రం తెలియలేదు.  ‘‘కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వడానికి స్విగ్గీ, జొమాటో దగ్గర దండిగా నిధులు ఉన్నాయి. ఇండియాలో ఫుడ్‌‌‌‌ డెలివరీ బిజినెస్‌‌‌‌ తమకు లాభదాయకం కాదని ఉబర్‌‌‌‌ భావిస్తోంది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక అధికారి వెల్లడించారు. ఉబర్‌‌‌‌ ఈ వ్యాపారం కోసం వందల కోట్లు ఖర్చు చేసినా, నెలలో ఆర్డర్ల సంఖ్య 13 లక్షలు దాటడం లేదు. మొదట్లో మాత్రం ప్రతినెలా 25 శాతం వృద్ధి కనిపించినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జొమాటో, స్విగ్గీలు నెలకు దాదాపు 3.5 కోట్ల వరకు ఆర్డర్లు డెలివరీ ఇస్తున్నాయి. ఫుడ్‌‌‌‌పాండా డెలివరీల సంఖ్య 40 లక్షలు మించడం లేదు. అందుకే ఓలా దీనిని వదిలిపెట్టింది. దాదాపు అన్ని ఫుడ్‌‌‌‌ డెలివరీ కంపెనీలు ఆర్డర్లపై డిస్కౌంట్లు తగిస్తున్నాయి. వినియోగదారులు మునుపటిలాగేనే ఆర్డర్లు ఇస్తారా తగ్గించుకుంటారా అనేది ఆసక్తికరం.

కలిసొచ్చిన ఐపీఎల్‌‌‌‌

పెట్టుబడిదారులు సూచించినట్టే ఈ రెండు కంపెనీలు డెలివరీలను బాగా పెంచుకున్నాయి బెంగళూరుకు చెందిన యూనికార్న్‌‌‌‌ స్విగ్గీ దేశవ్యాప్తంగా 160 నగరాల్లో 1.8 లక్షల డెలివరీ పార్ట్‌‌‌‌నర్ల ద్వారా90 వేల రెస్టారెంట్ల నుంచి డెలివరీలు ఇస్తున్నది. రెస్టారెంట్ల డిస్కవరీతోపాటు ఫుడ్‌‌‌‌ డెలివరీ వ్యాపారం చేస్తున్న జొమాటో 10 వేల నగరాలు, పట్టణాల వాసులకు 14 లక్షల రెస్టారెంట్ల డెలివరీలు ఇస్తోంది. ఈ రెండు కంపెనీలు ప్రత్యేక ఒప్పందాల ద్వారా డెలివరీలను మరింత పెంచుకుంటున్నాయి. ఇటీవల ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు జరిగినప్పుడు ఇవి క్విజ్‌‌‌‌లు నిర్వహిస్తూ ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తూ పెద్ద ఎత్తున కస్టమర్లను ఆకర్షించాయి. ఐపీఎల్‌‌‌‌ సమయంలో ఫుడ్‌‌‌‌ డెలివరీ సంఖ్య 26 లక్షలు పెరిగిందని రెడ్‌‌‌‌సీర్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ ఏజెన్సీ తెలిపింది. సాధారణ రోజులతో పోలిస్తే ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల సమయంలో ఆర్డర్లు 30 శాతం పెరిగాయని స్విగ్గీ ప్రకటించింది. క్రికెట్​ జట్లపై పందేలు కాయడాన్ని బట్టి జొమాటో డిస్కౌంట్లు ఇచ్చింది. దాదాపు 40 లక్షల మంది ‘జొమాటో ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌’ గేమ్‌‌‌‌ ఆడారని తెలిపింది. మనదేశంలో ఆర్డర్ల పరంగా స్విగ్గీ ఒకటో స్థానంలో, జొమాటో రెండోస్థానంలో ఉందని రెడ్‌‌‌‌సీఆర్‌‌‌‌ వెల్లడించింది. 2019లో ఇవి మూడంకెల వృద్ధిని నమోదు చేశాయని తెలిపింది.

Latest Updates