
- సెక్స్టార్షన్ కేసులో భారీగా నష్టపోయిన 70 ఏండ్ల రిటైర్డ్ ఉద్యోగి
- మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరికి ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో వల విసిరిన కేటుగాళ్లు. అతడికి ఏకంగా రూ. 43 లక్షలకుపైగా టోకరా వేశారు. హైదరాబాద్‌కు చెందిన 70 ఏండ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి 2024 జనవరిలో ఫేస్ బుక్ లో ఓ మహిళ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతడు యాక్సెప్ట్ చేసిన తర్వాత మహిళ పేరుతో అకౌంట్ నడుపుతున్న కేటుగాడు ఒక మహిళ రూపంలో చాటింగ్ షురూ చేశాడు. తన కుటుంబం పేదరికంలో ఉందని, తండ్రి వదిలేసి వెళ్లాడని.. తల్లి టైలర్ గా పని చేస్తోందని నమ్మించాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం సాయం కావాలని అడిగాడు. కేబుల్ ఆపరేటర్ అంటూ ఒకరి మొబైల్ నెంబర్ ఇచ్చి, వైఫై కనెక్షన్ పెట్టించాలని కోరాడు.
అవతల ఉన్నది నిజంగా మహిళేనని, కష్టాల్లో ఉందని నమ్మిన బాధితుడు రూ. 10 వేలు చెల్లించాడు. తర్వాత చాటింగ్ ఆపెయ్యడంతో బాధితుడు కేబుల్ ఆపరేటర్ పేరిట ఇచ్చిన నెంబర్ కు కాల్ చేశాడు. దీంతో ఆమె తీవ్రమైన వ్యాధితో దవాఖానలో ఉందని, చికిత్స కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతోందని ఆ వ్యక్తి చెప్పాడు. నిజమేనని నమ్మిన వృద్ధుడు విడతలవారీగా.. ట్రీట్మెంట్, వ్యక్తిగత అవసరాల కోసమని రూ. 10 లక్షల వరకూ పంపాడు. కేబుల్ ఆపరేటర్ పేరిట పరిచయం చేసిన వ్యక్తికి క్రెడిట్ కార్డు పంపగా.. అతడు రూ. 2.65 లక్షలు డ్రా చేశాడు. తర్వాత ఆ కేటుగాడు దుబాయ్ వెళ్తున్నట్లు చెప్పి చాటింగ్ ఆపేశాడు.
సెక్స్ చాట్ లోకి లాగి..
కొద్ది రోజుల తర్వాత అదే మొబైల్ నెంబర్ నుంచి కేబుల్ ఆపరేటర్ తల్లి, సోదరి అని చెప్పి వృద్ధుడిని సెక్స్సంబధిత చాట్‌లోకి లాగారు. తర్వాత కేబుల్ ఆపరేటర్ లైన్లోకి వచ్చాడు. తన సోదరితో అనుచితంగా చాట్ చేశావని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. సోదరి, తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నానని భయపెట్టాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా నటిస్తూ ఫేస్బుక్ ద్వారా బాధితుడిని సంప్రదించాడు. విషయాన్ని సెటిల్ చేసుకోవాలని లేకపోతే చిక్కులు తప్పవని బెదిరించాడు.
దీంతో డిమాండ్ చేసిన ప్రకారం.. అమ్మాయి చదువు, ఆమె తల్లి డ్వాక్రా రుణం తీర్చడానికని రూ.12.5 లక్షలు చెల్లించాడు. అయితే, ఎస్ఐ ఫిర్యాదు కాపీ తీసుకున్నాడని.. కేసు ముందుకు వెళ్లకుండా ఉండాలంటే రూ. 10 లక్షలు కావాలని మళ్లీ కానిస్టేబుల్ పేరిట డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు. మళ్లీ కానిస్టేబుల్ పేరిట రూ. లక్ష డిమాండ్ చేయగా, అది కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ఐ బదిలీ అయ్యాడని, కొత్త ఎస్ఐ బాధ్యతలు స్వీకరించాడని చెప్పారు.
వీడియోకాల్ రికార్డు చేసి..
కొత్త ఎస్ఐ పేరిట వృద్ధుడితో మాట్లాడిన మరో స్కామర్.. మైనర్ తో సెక్స్ చాట్ చేశావని.. పోక్సో చట్టం కింద కేసు పెట్టకుండా ఉండాలంటే రూ. 7.35 లక్షలు ఇవ్వాలన్నాడు. బాధితుడు ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు. చివరకు 2025 ఏప్రిల్ 25న రాత్రి ఆ అమ్మాయి నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆమె స్క్రీన్‌పై కనిపించలేదు కానీ బాధితుడిని మాత్రం నగ్నంగా కనిపించాలని కోరింది. అతడి వీడియోను రికార్డు చేసిన కేటుగాడు.. మరుసటి రోజు, పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పి కాల్చేశారు.
ఆ అమ్మాయి తాత కోసం రూ. 6.5 లక్షలు, ఎస్ఐ కోసం రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. జూన్ 25వ తేదీలోపు ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. ఇలా ఇప్పటివరకూ మొత్తం రూ. 43.60 లక్షల వరకూ ట్రాన్స్ ఫర్ చేసిన బాధితుడు.. చివరకు తాను మోసపోతున్నానని గమనించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.