
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’. ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆమిర్‌కు జంటగా జెనీలియా నటించగా.. ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించాడు.
ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి దివ్య నిధి శర్మ కథను అందించారు. హాలీవుడ్‌లో 2018 సంవత్సరంలో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని రూపొందించారు.
నేడు శుక్రవారం (జూన్ 20న) ‘సితారే జమీన్ పర్’మూవీ భారీ అంచనాలతో, కొన్ని కాంట్రవర్సీల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ బాస్కెట్‌బాల్ కోచ్ అయిన గుల్షన్ పాత్రలో నటించారు. మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న (ఆటిజం ఉన్న పిల్లల) బృందాన్నీ,ప్లేయర్స్‌గా ఎలా తీర్చిదిద్దారనే కథాంశంతో మూవీ రూపొందింది. మానసిక సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లలు.. బాస్కెట్ బాల్ ప్లేయర్స్‌గా ఎలా రెడీ అయ్యారనేది పూర్తి రివ్యూలో చూసేద్దాం.
కథేంటంటే:
బాస్కెట్‌బాల్ కోచ్ గుల్షన్ అరోరా (ఆమీర్ ఖాన్) ఇతనొక అహంకారి. కోపం, ప్రస్టేషన్, దురుసుతనం, సీనియర్స్‌తో గొడవపడటం వంటి అలవాట్లు అతని సొంతం. అందులో భాగంగా అతనికున్న కోపంతో తన సీనియర్‌ను కొట్టినందుకు సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత, అతను తాగి పోలీసు వ్యాన్‌ను ఢీకొడతాడు. దీంతో మూడు నెలల పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని జడ్జ్ శిక్ష విధిస్తారు.
ఇందులో భాగంగా మూడు నెలల పాటు స్పెషల్ ఎబిలిటీస్ (ఆటిజం ఉన్న పిల్లల) కలిగిన వారి బృందానికి బాస్కెట్‌బాల్ నేర్పించాలి. ఇలాంటి లక్షణాలున్న ఆ వ్యక్తి మానసికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వాళ్లను బాస్కెట్ బాల్ ప్లేయర్స్‌గా ఎలా తీర్చిదిద్దాడు? తనను తాను ఎలా మార్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? చివరికి ఆ టీమ్ విజేతగా నిలిచిందా? లేదా? అనేది మూవీ మిగతా కథ.
ఎలా ఉందంటే:
2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’కి ఇది సీక్వెల్. ఎమోషనల్ కంటెంట్ అయినప్పటికీ వీలయినంత ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. టాలెంటెడ్ బాస్కెట్ బాల్ కోచ్ గుల్షన్ (ఆమీర్ ఖాన్). కానీ తన కోపం, ప్రస్టేషన్, దురుసుతనం, సీనియర్స్‌తో గొడవపడటం, డ్రింక్ చేసి యాక్సిడెంట్ చేయడం లాంటి కారణాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. జడ్జి అతనిలోని టాలెంట్ గుర్తించి.. కొందరు మానసిక దివ్యాంగులకు మూడు నెలల్లో బాస్కెట్ బాల్ టీమ్‌గా ట్రైన్ చేయాలని తీర్పునిస్తారు. కానీ, ఇది తనకు ఏ మాత్రం నచ్చదు. అయినా, చేసేదేం లేక అయిష్టంగా ఆ పనిని చేపడతాడు.
ఇలా ఫస్టాఫ్ మొత్తం తన క్యారెక్టర్ తీరు, తన పర్సనల్ లైఫ్, ఆ తర్వాత జైలు జీవితం, కోచింగ్ ఈ అంశాలతోనే సాగుతోంది. అయితే, ఈ స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న పిల్లలు తమ వైపు ఎలాంటి సానుభూతుని కోరుకోరు. తమ సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకునే తీరు ఆకట్టుకుంటోంది. అలాంటి టీమ్ కు ఓ కోపిష్టి కోచ్ వచ్చినప్పుడు వారు ఎలాంటి పరిస్థితులు పేస్ చేశారనేది ఆసక్తిగా నడుస్తోంది.
మెల్ల మెల్లగా ఆమీర్ తన టీమ్ ని అర్ధం చేసుకోవడం, వారికి తనదైన శైలిలో కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయడంతో కథలో వేగం పెరుగుతోంది. ఇది పూర్తిగా సెకండాఫ్లో ఉంటుంది. కోచింగ్ ఇచ్చే క్రమంలో వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఆపై సునీత (జెనీలియా దేశ్‌ముఖ్) తో గుల్షన్ అరోరా ఉండే తీరు ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్గా ఉంటాయి. ఈ క్రమంలో గుల్షన్ పాత్రలో ఆమీర్ ఏడ్పిస్తాడు కూడా. భర్తకు సపోర్ట్ చేసే భార్యగా జెనీలియా అద్భుతంగా కనిపించింది.
ముఖ్యంగా, ఇందులో మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లల ఆట తీరు, ఈ క్రమంలో వారికీ వచ్చే కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అసలు ఇలాంటి పిల్లలను ప్లేయర్స్‌గా మలచాలంటే.. ఎలాంటి మెళుకువలు నేర్పాలో సినిమాలో చక్కగా చూపించారు. కామెడీ, ఎమోషన్, ఎంటర్‌టైన్మెంట్.. ఇలా ప్రతిదీ కథలో పొందుపరిచిన విధానం ప్రేక్షకుల చేత విజిల్ కొట్టించుకుంటోంది. ఇలా మొత్తానికి ఈ సితారే జమీన్ పర్ హృదయానికి హత్తుకునే కథాంశముతో ఆకట్టుకుంటోంది.