- మధ్యవర్తి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా జీపీవోను పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామపంచాయతీ పరిపాలన అధికారి(జీపీవో) దుర్గాప్రసాద్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. మధ్యవర్తి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపేట గ్రామానికి చెందిన మహ్మద్ ఫకీర్‌కు పెద్దపేట శివారులోని సర్వే నం.10లో 29 గుంటల భూమి ఉంది.
సాదాబైనామా ద్వారా పట్టా పాస్‌బుక్ జారీ చేసేందుకు జీపీవో దుర్గాప్రసాద్ రూ.1.30 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.80 వేలు చెల్లించాలని, మిగతా రూ.50 వేలు పని పూర్తయ్యాక ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచనల మేరకు మంగళవారం పెద్దపేట గ్రామ శివారులో జీపీవోతో కలిసి వచ్చిన కిరాణా షాప్ ఓనర్ పోతురాజుల రాజేందర్‌కు లంచం ఇచ్చాడు. రాజేందర్ డబ్బులు తీసుకొని జీపీవోతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
