- ఒరాకిల్‌లో 30 వేల మంది ఇంటికి
- ఏఐ, ఆటోమేషనే కారణం
- గతేడాది 1.24 లక్ష మందిపై వేటు
న్యూఢిల్లీ: టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను వదులుకోవడానికి సంకోచించడం లేదు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 106 గ్లోబల్ కంపెనీలు 93 వేల కంటే ఎక్కువ మందిని తొలగించాయి. ఏఐ, ఆటోమేషన్ ఇందుకు ముఖ్య కారణం. కోడింగ్, కస్టమర్ కేర్ వంటి పనుల్లో ఎక్కువ భాగం ఏఐతోనే జరుగుతుండటంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోతోందని కంపెనీలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా 1.24 లక్షల మందిని తొలగించారు.
layoff.fyi డేటా ప్రకారం నయాక్స్, టబూలా, ప్రొడక్ట్ బోర్డ్, కార్స్ డాట్‌కామ్ వంటి కంపెనీలు 3 శాతం నుంచి 30 శాతం వరకు ఉద్యోగులను తగ్గించాయి. అమెరికా కేంద్రంగా పనిచేసే కంపెనీల్లో 80 వేల మంది, ఆస్ట్రేలియా కంపెనీల్లో 3,800 మందికి పింక్‌స్లిప్స్ అందాయి. మెటా, ఎపిక్ గేమ్స్, పింట్రెస్ట్, విమియో కలిపి 14,705 మందిని తొలగించాయి. ఫైనాన్స్ విభాగంలో 17 కంపెనీలు 5,097 జాబ్స్‌ను తగ్గించాయి. మెటా ప్లాట్‌ఫామ్స్ దాదాపు ఎనిమిది వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఇది సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతానికి సమానం. ఇప్పటికే జనవరిలో 1,500 మందిని తొలగించింది. స్నాప్ చాట్ వెయ్యి మందిని విధుల్లో నుంచి తీసివేస్తున్నట్లు ప్రకటించింది. ఒరాకిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందిని తొలగించింది. భారత్ నుంచి 10 వేల మంది ఉన్నారు.
మనదేశంలోనూ భారీగా కోత
ఇండియాలో టాప్ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 23,460 మందిని తొలగించింది. టెక్ మహీంద్రా 1,108 మందిని తీసివేసింది. మరోవైపు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్ తమ నియామకాల్లో కోత పెట్టాయి. డిమాండ్ అనిశ్చితి, క్లయింట్ నిర్ణయాల్లో ఆలస్యం, ఏఐ పెరగడం వల్ల నియామకాలు నెమ్మదించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఐటీ ఉద్యోగాల ఓపెనింగ్స్ 8 శాతం తగ్గి 1.10 లక్షలకు చేరుకున్నాయి. చెన్నైకి చెందిన సాస్ స్టార్టప్ సూపర్ ఓప్స్ 60 మందిని, పాకెట్ ఎఫ్ఎం 10 శాతం మందిని తొలగించాయి. ఐటీ రంగం ప్రస్తుతం నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తోంది. కేవలం సిబ్బంది సంఖ్యను పెంచుకోవడం కంటే ఏఐ స్కిల్స్, ప్రత్యేక ప్రతిభ ఉన్న అభ్యర్థులనే కంపెనీలు ఎంచుకుంటున్నాయి.
కంపెనీ లే ఆఫ్స్
ఒరాకిల్ 30 వేలు
అమెజాన్ 16 వేలు
డెల్ 11 వేలు
మెటా 8 వేలు
బ్లాక్ 4 వేలు
అట్లాసియన్ 1,600
స్నాప్ 1,000
ఈబే 800
కాయిన్ బేస్ 700
ఫ్రెష్‌వర్క్స్ 500
