కాస్ట్లీ ఐఫోన్ కొనాలని చాలామంది కలలు కంటారు. అయితే ఫోన్ కొనేటప్పుడు దాని ధర మాత్రమే కాదు.. ఒకవేళ ఫోన్ పాడైతే రిపేర్ చేయించడానికి ఎంత ఖర్చవుతుందో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకునే వారు ఈ విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ఆపిల్కు చెందిన ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో రిపేర్ ఖర్చులు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఈ ఫోన్ లోపలి స్క్రీన్ పగిలితే దాన్ని మార్చడానికి ఏకంగా రూ.1,49,900 వరకు ఖర్చవుతుందని ఆపిల్ కంపెనీ ఇచ్చిన వివరాలు చెబుతున్నాయి. అంటే, స్క్రీన్ రిపేర్ కోసమే ఒక కొత్త కాస్ట్లీ స్మార్ట్ఫోన్ కొనే అంత ఖర్చు కావొచ్చు.
ఈ ఐఫోన్ డ్యూయో ధర ఇండియాలో రూ.2,99,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాంటప్పుడు లోపలి డిస్ప్లే మార్చడానికి అయ్యే ఖర్చు ఫోన్ అసలు ధరలో దాదాపు సగం అవుతుంది. మరి ఈ ఫోన్లోని ఇతర భాగాలు పాడైతే ఎంత ఖర్చవుతుంది ? ఆపిల్కేర్ తీసుకుంటే ఎంత వరకు డబ్బు ఆదా అవుతుందో ? వివరంగా తెలుసుకుందాం...
ఐఫోన్ డ్యూయో రిపేర్ ఖర్చులు ఎంతంటే?
ఆపిల్కేర్ ప్లాన్ తీసుకోకుండా ఫోన్ను రిపేర్ చేయించుకుంటే, అయ్యే రిపేర్ ఖర్చులు ఎంత అంటే...
*కవర్ దెబ్బతింటే ఖర్చు రూ.5,900
*బ్యాక్ గ్లాస్ మార్చాలంటే రూ.20,900
*బ్యాటరీ సర్వీస్ ఖర్చు రూ.24,900
*బ్యాక్ కెమెరా రిపేర్ ఖర్చు రూ.26,900
*బయటి స్క్రీన్ మార్చాలంటే రూ.42,900
*బయటి స్క్రీన్, బ్యాక్ గ్లాస్ రెండు మార్చాలంటే రూ.55,900
*లోపలి స్క్రీన్ మార్చాలంటే రూ.1,49,900
*ఇతర పెద్ద రిపేర్లు, డ్యామేజ్ రిపేర్ ఖర్చుకి రూ.2,24,900
ఈ ధరలను చూస్తే, చిన్న చిన్న రిపేర్లకు కూడా వేల రూపాయలు ఖర్చవుతాయని అర్థమవుతోంది. ఇక ఫోన్ లోపలి స్క్రీన్ దెబ్బతింటే మాత్రం రిపేర్ ఖర్చు లక్షన్నర వరకు ఉంటుంది. అంతేకాదు, ఫోన్ బాగా డ్యామేజ్ జరిగి, ఇతర రేపేర్లతో రూ.2,24,900 వరకు ఖర్చవుతుందని వివరాలు చెబుతున్నాయి. అందుకే ఇలాంటి ఖరీదైన ఫోన్ను ఉపయోగించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
లోపలి స్క్రీన్ రిపేర్కే రూ.1.5 లక్షలా?
ఫోల్డబుల్ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైనది లోపలి పెద్ద స్క్రీన్. ఫోన్ తెరిచినప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుంది. అయితే, ఇదే స్క్రీన్ దెబ్బతింటే జేబుకు భారీ చిల్లు పడే అవకాశం ఉంది. ఐఫోన్ డ్యూయో లోపలి స్క్రీన్ను మార్చడానికి రూ.1,49,900 వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తంతో మరో కొత్త కాస్ట్లీ ఫోన్ కొనే ఛాన్స్ ఉంటుంది. బయటి స్క్రీన్ ఎక్స్చేంజ్ కూడా రూ.42,900 వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అంటే ఫోన్ బయట భాగం దెబ్బతిన్నా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అని అనుకోలేం.
ఆపిల్కేర్ తీసుకుంటే ఎంత ఖర్చు తగ్గుతుంది?
ఖరీదైన ఐఫోన్ కొనేవారికి ఆపిల్కేర్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఐఫోన్ డ్యూయో కోసం ఈ ప్లాన్ ధర రూ.51,900గా పేర్కొన్నారు. ఈ ప్లాన్ కింద ఫోన్ కిందపడ్డ, దానిపై నీరు లాంటివి పడటం వంటి ప్రమాదాల వల్ల జరిగే నష్టాలకు రిపేర్ చేసే ఛాన్స్ లభిస్తుంది. అయితే, ప్రతి రిపేర్కు కొన్ని సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
యాపిల్కేర్తో లభించే కొన్ని రిపేర్ ప్రయోజనాలు ఇవి:
*బ్యాటరీ సర్వీస్ ఫ్రీ
*కవర్ పై గీతలు పడితే రూ.1,900
*బ్యాక్ గ్లాస్ మార్చితే రూ.2,500
*బయటి స్క్రీన్ మార్చితే రూ.2,500
*లోపలి స్క్రీన్ లేదా అనుకోకుండా ఎక్కువగా డ్యామేజ్ అయితే రూ.8,900
ఈ ధరలు యాపిల్కేర్ నిబంధనలకు లోబడి ఉంటాయి. ప్లాన్లో ఏ రకమైన రిపేర్ కవర్ అవుతుంది, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి అనే విషయాలను కొనే ముందు తెలుసుకోవాలి.
రూ.1.49 లక్షల రిపేర్.. ఆపిల్కేర్తో రూ.8,900 మాత్రమే!
ఇక్కడే అసలు తేడా కనిపిస్తుంది. ఆపిల్కేర్ లేకుండా లోపలి స్క్రీన్ మార్చడానికి రూ.1,49,900 చెల్లించాల్సి వస్తే, ఆపిల్కేర్ ఉంటె అదే రిపేర్కు రూ.8,900 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఈ రిపేర్ ఖర్చుల మధ్య మొత్తం రూ.1,41,000 తేడా ఉంటుంది. అయితే ఆపిల్కేర్ ప్లాన్ కొనేందుకు రూ.51,900 చెల్లించాలి.
ఉదాహరణకు, మీరు ఫోన్ కొన్నప్పుడు ఆపిల్కేర్ కూడా తీసుకున్నారని అనుకుందాం. ఆ తర్వాత లోపలి స్క్రీన్ పగిలితే, ప్లాన్ ధరతో పాటు రిపేర్ ఛార్జీ కలిపి మొత్తం రూ.60,800 అవుతుంది. ఆపిల్కేర్ లేకుండా అదే రిపేర్ చేయిస్తే రూ.1,49,900 ఖర్చవుతుంది.
ఈ ఉదాహరణ ప్రకారం, ఒక్క పెద్ద రిపేర్ జరిగినా ఆపిల్కేర్ తీసుకోవడం వల్ల చాలా మొత్తం డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే, అసలు లాభం... మీ ఫోన్కు ఎలాంటి రిపేర్, ఎన్ని సార్లు రిపేర్ అవసరమవుతుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఆపిల్కేర్లో ఎం కవర్ కావు అంటే ?
ఆపిల్కేర్ తీసుకుంటే అన్ని రిపేర్లకు పూర్తి సేఫ్టీ లభిస్తుందని అనుకోకూడదు. వివరాల ప్రకారం, ఈ ప్లాన్ అనుకోకుండా జరిగే నష్టాలకు రక్షణ కల్పిస్తుంది. అయితే, ఫోన్ దొంగతనం లేదా పోవడం జరిగితే కవర్ కాదు. అలాగే, రిపేర్ సమయంలో సర్వీస్ ఛార్జీలు, ఇతర నిబంధనలను కూడా ముందుగా తెలుసుకోవాలి.
ఐఫోన్ డ్యూయో కొనాలనుకునేవారు ఏం చేయాలి?
ఫోల్డబుల్ ఫోన్ కొనడం అంటే దాని ధర కడితే కాదు. ఫోన్ మెయింటెనెన్స్, స్క్రీన్ రిపేర్, ఇతర పార్ట్శ్ రిపేర్ ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఫోన్ ఎక్కువగా కిందపడే అవకాశం ఉంటే లేదా రోజు వాడకంతో ఎక్కువ ప్రమాదం ఉంటుందని భావిస్తే, ఆపిల్కేర్ వంటి సేఫ్టీ ప్లాన్ను తీసుకోవడం మంచిది. మరోవైపు, మీరు ఫోన్ చాలా జాగ్రత్తగా ఉపయోగించినా, రిపేర్ ఖర్చులు ఎంత ఉంటాయో ముందుగానే తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఫోన్ కొన్న ధరతో పాటు దాని రిపేర్ ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలం.
గమనిక: ఈ ఐఫోన్ డ్యూయో రిపేర్ ఖర్చు, సర్వీస్ ఛార్జీలు, ఆపిల్కేర్ వివరాలు అందించిన సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. కొనే ముందు లేదా రిపేర్ చేయించుకునే ముందు ఆపిల్ అధికారిక వెబ్సైట్ లేదా ఆథరైజేడ్ సర్వీస్ సెంటర్లో లేటెస్ట్ ధరలు, నిబంధలు చెక్ చేయాలి.
