పుడమికి పూల సింగిడి.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా  పెద్ద బతుకమ్మ వేడుకలు

పుడమికి పూల సింగిడి..  రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా  పెద్ద బతుకమ్మ వేడుకలు
  • ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అంబరాన్నంటిన సద్దుల సంబురాలు
  • అమరవీరుల స్మారకం నుంచి మహా బతుకమ్మ ర్యాలీ
  • 700 మంది కళాకారులు, 600 మందికిపైగా 
  • మహిళల సందడితో పులకించిన సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తీరం
  • హాజరైన గవర్నర్ దంపతులు, విదేశీ దౌత్యవేత్తలు, 
  • మంత్రులు జూపల్లి, సీతక్క, మహిళా నేతలు 
  • రష్మిక బతుకమ్మ ఆట..హీరో విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందడి
  • కనువిందు చేసిన లేజర్ షో, ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక వైభవానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచే పూల పండుగ  సద్దుల బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. పల్లె, పట్నం తేడా లేకుండా తొమ్మిది రోజులపాటు సాగిన వేడుకలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. తీరొక్క పూలతో ఊరూవాడా పూలవనంగా మారాయి. ఆడపడుచులు అందంగా పేర్చిన  బతుకమ్మలతో ఒక్కచోట చేరి ఆడిపాడి సందడి చేశారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’.. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమిమి కాయొప్పునే’ అంటూ పాటలు పాడుతూ లయబద్ధంగా నృత్యాలు చేస్తూ సెలబ్రేట్​ చేసుకున్నారు. తీరొక్క పూలతో గౌరమ్మను కొలిచిన ఆడబిడ్డలు.. ఊరూరా బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. బతుకమ్మలను ఆడి అనంతరం గౌరమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు. 

ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆకట్టుకున్న సంబురాలు 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు మహా బతుకమ్మ ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. ఈ ర్యాలీలో 700 మంది జానపద కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలతో కదం తొక్కారు.  600 మందికిపైగా మహిళలు నెత్తిన బతుకమ్మలతో కదిలారు.  అనంతరం ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ ఆటపాటలతో హోరెత్తించారు. వేడుకల సందర్భంగా ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ఏర్పాటు చేసిన లేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షో, ఆకాశంలో మెరిసిపోయిన ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్ నగరవాసులు, పర్యాటకులకు కనువిందు చేశాయి.


హుస్సేన్‌‌‌‌సాగర్ తీరం విద్యుద్దీపాల కాంతులతో మెరిసిపోయింది.  ఈ ముగింపు వేడుకల్లో  ముఖ్య అతిథిగా గవర్నర్​శివ ప్రతాప్ శుక్లా దంపతులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని, అమెరికా కాన్సులేట్‌‌‌‌ జనరల్ లారా, ఆల్సో హానరబుల్ కౌన్సిల్ జనరల్ జర్మనీ అమితాబ్ దేశాయి, డిప్యూటీ హెడ్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ హైదరాబాద్ రోషిని, హెడ్ ఆఫ్ బ్యూరో ఫ్రాన్స్ పియర్ బెర్డిసన్ పాల్గొన్నారు. 

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి జూపల్లి 

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ఆడబిడ్డలందరికీ, ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రంగురంగుల పూలను పేర్చి, పూలనే దేవతగా కొలిచే గొప్ప సంప్రదాయం తెలంగాణ సొంతమని కొనియాడారు. తెలంగాణ పర్యాటక రంగానికి బతుకమ్మ, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతర  బ్రాండ్‌‌‌‌గా మారాయని, మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మికతోపాటు వివిధ రంగాల ప్రముఖులు తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుకు రావాలని ఆహ్వానించారు.

ప్రతి మహిళను బతుకమ్మలా గౌరవిద్దాం: మంత్రి సీతక్క

సమాజంలో ప్రతి మహిళను బతుకమ్మలా గౌరవించుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బతుకమ్మ ప్రకృతిని పూజించడంతోపాటు ఆరోగ్యాన్ని, కుటుంబ అనుబంధాలను పెంచే పండుగ అని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు.. 

తెలంగాణవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు ఊరూవాడా అంబరాన్నంటాయి. ప్రధానంగా చెరువులు, కుంటలు, చారిత్రక, ఆధ్యాత్మిక వేదికల వద్ద మహిళలందరూ ఒకచోట చేరి బతుకమ్మలతో సందడి చేశారు. హనుమకొండ, వరంగల్‌‌‌‌లో వెయ్యిస్తంభాల గుడి, పద్మాక్షి గుట్ట ప్రాంగణాలు వేలాది మంది మహిళల బతుకమ్మ ఆటపాటలతో కిటకిటలాడాయి. సిద్దిపేటలోని కోమటి చెరువుతీరాన నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు దంపతులు పాల్గొని, మహిళలతో కలిసి సందడి చేశారు. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. ఇందూరులోని అశోక్ సాగర్, ఖిల్లా రామాలయం ప్రాంగణాలు బతుకమ్మ సంబురాలతో కళకళలాడాయి. మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మంలోని ఏడుపాయల వనదుర్గ క్షేత్రం, ఖమ్మం మున్నేరు తీరం, నల్గొండ క్లాక్‌‌‌‌టవర్ సెంటర్లతోపాటు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రధాన జలాశయాల వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా గౌరమ్మకు నైవేద్యంగా తీరొక్క సద్దులను సమర్పించి.. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

బతుకమ్మ ఆడిన నటి రష్మిక మందన్న

ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ఏర్పాటు చేసిన భారీ వేదికపై ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  మంత్రి సీతక్క, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌పర్సన్ వెన్నెల, టూరిజం ఎండీ క్రాంతి వల్లూరుతో కలిసి రష్మిక బతుకమ్మ ఆడి అక్కడి మహిళలను, అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లా డుతూ.. ‘‘బతుకమ్మ పండుగను, సంప్రదాయ దుస్తుల్లో ఆడపడుచులను చూడ టం ఎంతో ముద్దుగా, సంతో షంగా ఉంది. తెలంగాణలో జరిగే అతిపెద్ద బతుకమ్మ వేడుకకు తీసుకువెళ్లి ఆడిస్తానని రష్మికకు గతంలో మాట ఇచ్చా. మన పండుగలు ఇంత జోరుగా సాగుతుండటం చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జి.సృజన, పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.