- ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- అలరించిన సింగర్ మంగ్లీ పాటలు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పండుగ ‘బతుకమ్మ’వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం గౌరీపూజతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలతో భవన్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మ ఆడి మురిసిపోయారు. ఉత్తరాది మహిళలు బతుకమ్మ ఔన్నత్యాన్ని తెలుసుకొని సంబరపడిపోయారు. ఈ సందర్భంగా అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, పల్లె జీవనం, ప్రకృతి పట్ల మనకున్న ప్రేమను బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుందన్నారు. అందరూ ఒకచోట చేరి, పాటలు పాడుతూ ఆనందాన్ని పంచుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అని అన్నారు. పిల్లలకు మన పండుగలు, పాటలు, ఆచారాలను పరిచయం చేయడం ద్వారా సంస్కృతిని తరువాతి తరాలకు అందించాలని సూచించారు.
హౌసింగ్ కార్పొరేషన్ లో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అధికారులు, ఉద్యోగులు, మహిళా సిబ్బంది కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మలు కార్యాలయానికి ప్రత్యేకమైన పండుగ శోభను తీసుకొచ్చాయి. మహిళా ఉద్యోగులు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్, జనరల్ మేనేజర్లు మమత, శ్రీదేవి, సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయకుమార్ తో పాటు సచివాలయంలోని హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులు, హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ తదితర సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం నాయకులు రమాదేవి, చంద్రకళ తదితరులు ప్రసంగించారు. ఒక డిపార్ట్ మెంట్ లోని ఉద్యోగులందరూ కలిసి పండుగను జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని, ఇది సిబ్బంది, ఉద్యోగుల మధ్య స్నేహభావాన్ని పెంచడంతో పాటు, అందరిలో ఐక్యతను, పరస్పర సహకార భావాన్ని పెంపొందిస్తాయన్నారు.
ఎన్నో రాష్ట్రాల మేళవింపు ఢిల్లీ: సీఎం రేఖా గుప్తా
తీరొక్క పువ్వులతో తయారైనా ‘బతుకమ్మ’మాదిరే... దేశంలోని అన్ని రాష్ట్రాలు/యూటీల సంస్కృతి, సంప్రదాయాలతో ఏర్పడిందే దేశ రాజధాని ఢిల్లీ అని సీఎం రేఖా గుప్తా అన్నారు. ఢిల్లీ అనే పూలమాలలో ప్రతి రాష్ట్ర ప్రజలు ఉంటారన్నారు.ప్రకృతిలో నారి శక్తి దాగి ఉందన్నారు. ‘ఢిల్లీ అనేది అందరిదీ. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు ప్రజలు నివసిస్తున్నారు. ఇది నా పెద్ద కుటుంబం.’అని అన్నారు. కాగా.. ఈ ప్రోగ్రాంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్టూడెంట్స్ తో ఆడగా... సింగర్ మంగ్లీ తన ప్రత్యేకమైన పాటల బాణీతో అందర్నీ అలరించారు.
