ప్రేమ కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్తారని అంటుంటారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి విషయంలో మాత్రం ఇది ఊహించని మలుపు తిరిగింది. తనకు కాబోయే భార్య దొరికిందని ఎంతో సంతోషపడ్డ అతను.. ఆమెను కలవడం కోసం తన దగ్గర ఉన్న ఉన్నవన్నీ అమ్మేసి, దాదాపు 1,900 కిలోమీటర్లు ప్రయాణించాడు. తీరా అక్కడికి వెళ్లాక అసలు విషయం తెలిసి షాకయ్యాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మహిళ నిజమైన మనిషి కాదని.. కృత్రిమ మేధ (AI) సృష్టించిన ఓ కల్పిత పాత్ర అని తెలుసుకుని అవాక్కయ్యాడు.
బ్రెజిల్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తులను పూర్తిగా నమ్మితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది.
సోషల్ మీడియాలో కనిపించిన అందమైన అమ్మాయి
బ్రెజిల్‌లోని ఈశాన్య ప్రాంతమైన మరాన్హావో రాష్ట్రానికి చెందిన 49 ఏళ్ల ఎడిమార్ మార్టిన్స్ ఇటుకల పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన తల్లి మరణించిన తర్వాత అతను ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే 2020లో సోషల్ మీడియాలో జెస్సికా ఒలివీరా అనే మహిళకు సంబంధించిన ఓ అకౌంట్ అతని కంటపడింది.
ఆ అకౌంట్లో ఓ మహిళ వ్యవసాయ క్షేత్రంలో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు కనిపించే వీడియోలు ఉండేవి. తనతో కలిసి ఉండటానికి వచ్చే పురుషులకు ఇల్లు, ఆర్థిక సహాయం అందిస్తానని ఆమె చెబుతున్నట్లు పోస్టులు ఉండేవి. ఈ అకౌంట్ కు మూడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు.
తన జీవితంలో ఒంటరితనాన్ని పోగొట్టి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ మహిళ సహాయం చేస్తుందని మార్టిన్స్ నమ్మాడు. ఆమె తనకు సరైన జీవిత భాగస్వామి అవుతుందని భావించాడు. ఒక వీడియోలో కూడా ఆమె తనకు ఆర్థికంగా తోడ్పడుతుందని, తన వ్యవసాయ క్షేత్రంలో ఉండేందుకు అవకాశం కల్పిస్తుందని అతను నమ్మాడు.
పెళ్లి చేసుకోవాలనే ఆశతో
ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో మార్టిన్స్ ఆమెను డైరెక్ట్ కలవాలని అనుకున్నాడు. ఇందుకోసం బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్ర రాజధాని బెలో హొరిజోంటెకు వెళ్లాలని అనుకున్నాడు. అయితే, అంత దూరం ప్రయాణించడానికి అతని దగ్గర సరిపడా డబ్బు లేదు. దీంతో అక్టోబర్ 9న తన దగ్గర ఉన్న వస్తువులను అమ్ముకుని ప్రయాణానికి అవసరమైన డబ్బు సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత బస్సులో ఒక రోజుకు పైగా ప్రయాణించి అక్టోబర్ 11న బెలో హొరిజోంటెకు చేరుకున్నాడు.
దాదాపు 1,900 కిలోమీటర్ల ప్రయాణం చేసిన అతనికి అక్కడికి చేరుకున్నాక తన కలల రాణిని కలుసుకోవచ్చని ఎంతో ఆశగా ఎదురుచూశాడు. కానీ అక్కడే అతనికి ఊహించని ట్విస్ట్ తగిలింది.
ఫొటో చూపిస్తూ వెతికినా.. కనిపించని మహిళ
బెలో హొరిజోంటెకు చేరుకున్న తర్వాత మార్టిన్స్ తన దగ్గర ఉన్న మహిళ ఫొటోలను చూపిస్తూ ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. అక్కడి స్థానికులను కూడా ఆమె గురించి అడిగాడు. కానీ ఎవరూ ఆమెను గుర్తుపట్టలేకపోయారు. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికీ తెలియలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో అతను చివరకు స్థానిక రేడియో స్టేషన్‌ను సంప్రదించాడు. అక్కడే అతనికి ఊహించని నిజం తెలిసింది.
తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మహిళ అసలు నిజమైన మనిషి కాదని, సోషల్ మీడియాలో కనిపించిన ఆమె రూపం కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన కల్పిత పాత్ర అని అతనికి వివరించారు. దీంతో మార్టిన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంతకాలం తాను నిజమని నమ్మిన వ్యక్తి అసలు ఉనికిలోనే లేదని తెలుసుకుని నిరాశపడ్డాడు.
ఏఐ సృష్టించిన పాత్ర వెనుక ఉన్న అసలు విషయం
ఈ ఘటనపై స్పందించిన సోషల్ మీడియా అకౌంట్ నిర్వహణకు సంబంధించిన వ్యక్తి, ఆ మహిళ రూపాన్ని ఏఐ సాయంతో సృష్టించినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నాడు. ఆ అకౌంట్ ద్వారా ఎవరితోనూ డైరెక్ట్ గా మాట్లాడలేదని, మార్టిన్స్‌తో తనకు వ్యక్తిగత సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఆ అకౌంట్ ముఖ్య ఉద్దేశం ప్రజల దృష్టిని ఆకర్షించడం, ఆదరణ పొందడం మాత్రమేనని ఆమె పాత్ర వెనుక ఉన్న వ్యక్తి పేర్కొన్నట్లు వార్తలు వెల్లడించాయి. మార్టిన్స్ తనను కలుసుకోవడానికి ఇంత దూరం ప్రయాణించాడని తెలిసి ఆశ్చర్యపోయినట్లు కూడా తెలిపారు. దీంతో మార్టిన్స్ నమ్మిన ప్రేమకథ మొత్తం ఏఐ సృష్టించిన రూపం చుట్టూ నిర్మితమైందని స్పష్టమైంది.
డబ్బంతా అయిపోయింది.. అధికారుల సాయం కోరిన వ్యక్తి
తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని ప్రయాణం చేసిన మార్టిన్స్‌కు అక్కడికి చేరుకున్న తర్వాత తిరిగి వెళ్లడానికి కూడా డబ్బు లేకుండా పోయింది. తాను నమ్మిన వ్యక్తి నిజంగా లేరని తెలిసిన బాధ ఒకవైపు, స్వస్థలానికి తిరిగి వెళ్లేందుకు డబ్బు లేకపోవడం మరోవైపు అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో అతను స్థానిక అధికారులను సంప్రదించి సహాయం కోరాడు. అధికారులు, సామాజిక కార్యకర్తలు అతనికి అండగా నిలిచి తిరిగి వెళ్లేందుకు బస్సు టికెట్ ఇచ్చారు.
ఈ ఘటనతో తీవ్ర నిరాశకు గురైన.. జీవిత భాగస్వామిని వెతుక్కోవాలనే తన ఆశను మార్టిన్స్ పూర్తిగా వదులుకోలేదు. ప్రస్తుతం ఓ కుటుంబ సభ్యుడితో కలిసి ఉంటున్న అతను, భవిష్యత్తులో తనకు సరైన వ్యక్తి దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
ఈ ఘటన ప్రస్తుతం ఏఐ సాంకేతికత వల్ల ఏర్పడుతున్న కొత్త సమస్యలపై చర్చకు దారితీస్తోంది. కృత్రిమ మేధ సాయంతో మనుషుల్లా కనిపించే ఫొటోలు, వీడియోలు సృష్టించడం రోజురోజుకూ సులభమవుతోంది. వాటిని చూసి నిజమైన వ్యక్తులుగా నమ్మే ప్రమాదం కూడా ఉంది.
