అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు, కలవలేదు కూడా ! ఎప్స్టీన్ ఫైల్స్ పై దలైలామా క్లారిటీ..

అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు, కలవలేదు కూడా ! ఎప్స్టీన్ ఫైల్స్ పై దలైలామా క్లారిటీ..

బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు, అమెరికాకు చెందిన  జెఫ్రీ ఎప్స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దలైలామా కార్యాలయం ఆదివారం తీవ్రంగా ఖండించింది.

 దలైలామా అతని జీవితంలో జెఫ్రీ ఎప్స్టీన్‌ను ఎప్పుడూ కలవలేదు. ఆయన తరపున కూడా ఎవరూ ఎప్స్టీన్‌తో మాట్లాడలేదు, సమావేశం కాలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తేల్చి చెప్పింది. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో దలైలామా పేరును ఈ వివాదంలోకి లాగడంపై ఆయన కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.

అమెరికా ప్రభుత్వం జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన లక్షల ఫోటోలు, వీడియోలు, వార్తలను బయటపెట్టింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి.

 ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ ఎప్స్టీన్‌ ఫైల్స్ లో 30 లక్షలకు పైగా ఫైళ్లు, 2,000కి పైగా వీడియోలు, దాదాపు 1,80,000 ఫోటోలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ  ఎప్స్టీన్ ఫైల్స్ లో దలైలామా గురించి కూడా ప్రస్తావన ఉందని కొందరు ప్రచారం చేయడంతో ఈ వివాదం మొదలైంది. అయితే కేవలం పేరు ఉన్నంత మాత్రాన  తప్పు చేసినట్లు కాదని కొందరు నిపుణులు అంటున్నారు.

జెఫ్రీ ఎప్స్టీన్ ఒకప్పుడు అమెరికాలో పెద్ద ఫైనాన్షియర్‌గా ఉండేవాడు. అయితే, చిన్న పిల్లలను లైంగికంగా వేధించడం, వారిని అక్రమంగా రవాణా చేయడం వంటి దారుణమైన నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. 2019లో జైలులోనే అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన వ్యక్తులతో ఆయనకు పరిచయాలు ఉండటం వల్ల ఈ కేసు ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంది.