ఓటర్ల లిస్టులో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ లండన్‌లో నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనలో పాల్గొనాలని లండన్‌లో ఉంటున్న మద్దతుదారులకు ఆయన పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ స్క్వేర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకోవాలని కోరారు.
శుక్రవారం(16 అక్టోబర్) రాత్రి ధ్రువ్ రాథీ X ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇప్పటికే లండన్‌కు చేరుకున్నానని.. ఓటర్ల లిస్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రజలు వారి నిరసనను తెలియజేయాలని కోరారు.
తన X పోస్టులో, “మీరు లండన్‌లో ఉంటే, రేపు మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ స్క్వేర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు జరిగే నిరసనలో పాల్గొనండి” అని రాథీ పేర్కొన్నారు.
ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని చెబుతూ, “అంతర్జాతీయంగా మన గొంతు వినిపించే సమయం వచ్చేసింది” అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేసారు.
ఢిల్లీ పోలీసుల అదుపులో ధ్రువ్ రాథీ
ధ్రువ్ రాథీ లండన్‌లో నిరసనకు పిలుపునివ్వడం వెనుక మరో ముఖ్యమైన పరిణామం కూడా ఉంది. గత వారం ఢిల్లీలో జరగాల్సిన ఒక నిరసన కార్యక్రమానికి ముందు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
సమాచారం ప్రకారం, హర్యానాలోని గురుగ్రామ్‌లో సెక్టార్ 56 ప్రాంతంలో ఉన్న తన ఇంటి నుంచి ఢిల్లీ పోలీసులు ధ్రువ్ రాథీని అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమానికి ముందు ఈ ఘటన జరగ్గా... శనివారం రాత్రి ఆయనను విడుదల చేసినట్లు సమాచారం.
ఢిల్లీలో నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రతాపరమైన కారణాలు, విధివిధానాలను పేర్కొంటూ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. నిరసనకారులు జంతర్ మంతర్‌కు చేరుకోకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో పోలీసులను కూడా మోహరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ధ్రువ్ రాథీ ఇప్పుడు లండన్‌లో నిరసన చేపట్టాలని పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అసలు ఈ నిరసన ఎందుకు?
ఓటర్ల లిస్టుల తయారీ, సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలే ఈ నిరసనకు ప్రధాన కారణం. ఓటర్ల లిస్టులో పేర్ల నమోదు, తొలగింపు, మార్పులు వంటి అంశాలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఓటర్ల లిస్టులో ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ ఆరోపించింది.
అలాగే, ఓటరు నమోదుకు ఉపయోగించే ఫారం-6కు సంబంధించిన మార్పులపైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ని రసన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.
ఈ నిరసనకు సంబంధించిన పరిణామాలపై స్పందిస్తూ, మీ గొంతు వినిపించడానికి ముందుకు వస్తున్న యువతను ప్రభుత్వం భయపడుతోందని సీజేపీ ఆరోపించింది. ధ్రువ్ రాథీని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని కూడా CJP పార్టీ X ఖాతాలో ప్రస్తావించింది.
నిరసన కారణంగా మూసివేత
గత వారం ఢిల్లీలో జరగాల్సిన నిరసన కార్యక్రమం కారణంగా మరో పరిణామం కూడా చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం కానాట్ ప్లేస్ మార్కెట్‌ను శనివారం మూసివేయనున్నట్లు న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) ప్రకటించింది.
వీకెండ్లో కానాట్ ప్లేస్‌కు వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో నిరసన సందర్భంగా రద్దీ పెరిగి ప్రజల భద్రతకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ను మూసివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అమిత్ గుప్తా తెలిపారు.
I’ve just reached London It’s time the world sees the reality of vote chor and murderer of democracy. International danka bajane ka time aa gaya hai Join the protest tomorrow in front of Mahatma Gandhi’s statue in parliament square at 12pm if you’re here Jai Hind 🇮🇳
— Dhruv Rathee (@dhruv_rathee) October 16, 2026
