గద్దర్ అవార్డ్స్‌‌ 2025 సత్తా చాటిన చిన్న సినిమా

గద్దర్ అవార్డ్స్‌‌ 2025 సత్తా చాటిన చిన్న సినిమా

థియేటర్స్‌‌ కేటాయింపు మొదలు అవార్డుల వరకు చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందనే మాట తెలుగు సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తుంటుంది. అయితే  ప్రేక్షకుల తీర్పులో ఎప్పుడూ ఆ వ్యత్యాసం లేదు. మరీముఖ్యంగా ఇటీవల కంటెంట్‌‌ బాగున్న చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్‌‌ దగ్గర బ్లాక్ బస్టర్‌‌‌‌ హిట్ అవుతూ అద్భుత వసూళ్లు సాధిస్తున్నాయి. ఇప్పుడు గద్దర్ అవార్డుల విషయంలోనూ చిన్న సినిమాలు సత్తా చాటాయి. బడ్జెట్,  బిజినెస్‌‌,  స్టార్‌‌‌‌ కాస్టింగ్ లాంటి కమర్షియల్‌‌ హంగులను అధిగమించి కంటెంట్‌‌ ఈజ్‌‌ కింగ్‌‌ అని ప్రూవ్ అయింది. ముఖ్యంగా జనాన్ని ఆలోచింపజేసేవి, కదిలించే చిత్రాలను జ్యూరీ ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.  

చిన్న సినిమాకు దక్కిన గొప్ప గౌరవం

చిన్న చిత్రంగా  వచ్చి ప్రేక్షకుల ప్రేమతో పెద్ద విజయాన్ని సాధించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ఇప్పుడు గద్దర్‌‌‌‌ అవార్డ్స్‌‌లోనూ విజయ కేతనం ఎగురవేసింది. ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు మరో మూడు కేటగిరీస్‌‌లో అవార్డులు సాధించింది.  ఖమ్మం,  వరంగల్‌‌ జిల్లాల సరిహద్దులోని తన గ్రామంలో చిన్నప్పుడు జరిగిన ఓ రియల్‌‌ లైఫ్‌‌ ఇన్సిడెంట్‌‌ ఆధారంగా ఈ సినిమా తీసిన సాయిలు కంపాటి ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నాడు.  అలాగే చిత్రంలోని పాటకు అనురాగ్ కులకర్ణి ఉత్తమ గాయకుడిగా ఎంపికవగా, నెగెటివ్ రోల్ పోషించిన చైతు జొన్నలగడ్డ స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికయ్యాడు. 

కుల వివక్షపై ‘దండోరా’

రెండో ఉత్తమ చిత్రంగా ‘దండోరా’ నిలిచింది.  కుల వివక్ష మీద తీసిన ఈ సీరియస్ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకుగాను ఉత్తమ సహాయ నటుడిగా శివాజీ 
ఎంపికయ్యారు. అలాగే దీనికి సంగీతం అందించిన మార్క్‌‌ కె రాబిన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. 

విలేజ్‌‌ కామెడీతో ‘ప్రీ వెడ్డింగ్ షో’

తిరువీర్ హీరోగా వచ్చిన ‘ది గ్రేట్‌‌ ప్రీ వెడ్డింగ్‌‌ షో’ మూడో ఉత్తమ చిత్రంగా  నిలిచింది.  రాజు వెడ్స్ రాంబాయి,  ప్రస్తుతం ట్రెండింగ్‌‌లో ఉన్న  ప్రీ వెడ్డింగ్‌‌ షూట్‌‌ నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సింపుల్‌‌ స్టోరీ, క్లీన్‌‌ కామెడీతో ఈ చిత్రం ఆకట్టుకుంది. 

తెలంగాణ నేపథ్యానికి ప్రాధాన్యత..

ఉత్తమ చిత్రం కేటగిరీలో నిలిచిన మూడు చిత్రాల నేపథ్యం తెలంగాణ అయినప్పటికీ యూనివర్సల్‌‌ కంటెంట్‌‌తో ఇంప్రెస్‌‌   చేశాయి. అలాగే బైరాన్‌‌పల్లి వీరోచిత పోరాటం నేపథ్యానికి కొంత ఫిక్షన్‌‌ జోడించి తెరకెక్కించిన ‘ఛాంపియన్’ చిత్రం కూడా నాలుగు అవార్డులను గెలుచుకుంది. ఇందులో హీరోగా నటించిన రోషన్‌‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించగా, ఉత్తమ కొరియోగ్రాఫర్‌‌‌‌గా ‘ఆట’ సందీప్‌‌,  ఉత్తమ ఆర్ట్‌‌ డైరెక్టర్‌‌‌‌గా  తోట తరణి, ఉత్తమ యాక్షన్‌‌ కొరియోగ్రాఫర్‌‌‌‌గా పీటర్‌‌‌‌ హెయిన్స్‌‌ అవార్డులను గెలుచుకున్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంట్‌‌కు.. 

స్వాతంత్ర్య  సమరయోధుడు, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆధారంగా రూపొందిన ‘యూనిటీ :  ది మేన్ ఆఫ్ సోషల్ జస్టిస్’  ఉత్తమ మొదటి డాక్యుమెంటరీగా ప్రభుత్వం ప్రకటించింది. 

తండేల్‌‌ రాజు

నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన  ‘తండేల్’ చిత్రం గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యింది. ఉత్తమ  నటుడిగా నాగ చైతన్యకు అవార్డు లభించగా, బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్‌‌గా  కూడా సత్తా చాటింది.  రాజు అనే జాలరి  పాత్రలో నాగ చైతన్య  రా అండ్ రస్టిక్ లుక్‌‌లో  తనదైన సహజ నటనతో మెప్పించాడు. సాయి పల్లవి హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రాన్ని   గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌పై బన్నీ వాసు నిర్మించారు. 

ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌

ఇటీవల విజయ్ దేవరకొండను వివాహమాడి  తెలంగాణ కోడలిగా మారిన నేషనల్ క్రష్​ రష్మిక మందన్నా తన కెరీర్‌‌‌‌లో మరో ఘనతను దక్కించుకుంది.  ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికిగాను ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు గెల్చుకుంది.   ప్రేమికుడి షరతులన్నీ  పక్కనపెట్టి తనదైన స్వేచ్ఛను కోరుకునే యువతిగా రష్మిక  నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. గతేడాది నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద  మంచి వసూళ్లను సాధించింది.

చిరంజీవికి ఎన్టీఆర్‌‌‌‌ అవార్డు

గద్దర్ అవార్డుల్లో స్పెషల్‌‌ అవార్డుల కేటగిరీలో చిరంజీవికి ఎన్టీఆర్‌‌ జాతీయ అవార్డు ప్రకటించారు. అలాగే కమల్‌‌ హాసన్‌‌కు పైడి జయరాజ్‌‌ జాతీయ అవార్డు, నిర్మాత అశ్వనీదత్‌‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, ఆర్ నారాయణ మూర్తికి కేఎల్ కాంతారావు అవార్డు, జయసుధకు ఏఎన్నార్‌‌ అవార్డు,  గీత రచయిత సుద్దాల అశోక్‌‌ తేజను సినారే అవార్డుకు ఎంపిక చేశారు. ఉగాది సందర్బంగా ఈ నెల 19న గద్దర్‌‌‌‌ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రదానం చేయనున్నారు.

2025 గద్దర్‌‌  అవార్డ్స్ విజేతలు వీరే

ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్‌‌)

ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌‌)

ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా

ఉత్తమ తృతీయ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్‌‌ షో 

నేషనల్‌‌ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్‌‌

ఉత్తమ పర్యావరణ చిత్రం : ఇగ్వా

ఉత్తమ డెబ్యూ ఫీచర్‌‌ ఫిల్మ్: లిటిల్‌‌ హార్డ్స్

ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం

ఉత్తమ సోషల్‌‌ మెసేజ్‌‌ చిత్రం: కోర్టు 

ఉత్తమ స్పెషల్‌‌ ఎఫెక్ట్స్ మూవీ: మిరాయ్‌‌

ఉత్తమ బాలల చిత్రం: అనగనగా

ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ సపోర్టింగ్‌‌ నటుడు: శివాజీ (దండోరా) 

 ఉత్తమ సపోర్టింగ్‌‌ నటి: భూమిక చావ్లా (యూఫోరియా) 

ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్‌‌ (దండోరా)

ఉత్తమ నేపథ్య గాయకుడు:  

అనురాగ్‌‌ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప)

ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ  (జిగ్రీస్‌‌)

ఉత్తమ బాలనటుడు: రోహన్ ‌‌ రాయ్‌‌ (ప్రీ వెడ్డింగ్‌‌ షో)

ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్‌‌ (యుఫోరియా)

ఉత్తమ స్క్రీన్‌‌ ప్లే రైటర్‌‌: 

అనిల్‌‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) 

ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్‌‌ (కుబేర)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌‌: కార్తిక్‌‌ ఘట్టమనేని (మిరాయ్‌‌)

ఉత్తమ ఎడిటర్‌‌: శ్రీకర్‌‌ ప్రసాద్‌‌ (మిరాయ్‌‌) 

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌‌: ఎం.ఆర్‌‌ రాధాకృష్ణన్‌‌ (కిష్కింధపురి) 

ఉత్తమ కొరియోగ్రాఫర్‌‌: 

ఆట సందీప్ (గిర గిర గిర - ఛాంపియన్) 

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌‌: తోట తరణి  (ఛాంపియన్‌‌)

ఉత్తమ మేకప్‌‌ ఆర్టిస్ట్: వై గోవిందరాజు (అఖండ)

ఉత్తమ కాస్ట్యూమ్‌‌ డిజైనర్‌‌: చంద్రకాంత్‌‌ (ఛాంపియన్) 

స్పెషల్ అవార్డ్స్: 

ఎన్టీఆర్ జాతీయ అవార్డు: చిరంజీవి 

పైడి జయరాజ్ అవార్డు: కమల్ హాసన్

బీఎన్‌‌ రెడ్డి అవార్డు: సింగీతం శ్రీనివాసరావు

నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: అశ్వినీదత్ 

కేఎల్ కాంతారావు అవార్డు: ఆర్ నారాయణ మూర్తి

రఘుపతి వెంకయ్య అవార్డు: రమేశ్ ప్రసాద్

సి.నారాయణ రెడ్డి అవార్డు: సుద్దాల అశోక్ తేజ

అక్కినేని నాగేశ్వరరావు అవార్డు: జయసుధ

స్పెషల్ జ్యూరీ అవార్డ్స్: 

స్పెషల్‌‌ జ్యూరీ 1: 23 (డైరెక్టర్ రాజ్ రాచకొండ) 

స్పెషల్ జ్యూరీ 2: చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)

స్పెషల్‌‌ జ్యూరీ 3: రోషన్‌‌ (ఛాంపియన్‌‌)

స్పెషల్ జ్యూరీ 4 : అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు)

ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్: యూనిటీ ద మేన్ ఆఫ్ సోషల్ జస్టిస్ (చిరందాసు శ్రీకాంత్) 

సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్: ద ఫస్ట్ యాక్షన్ హీరో 

పైడి జయరాజ్ ప్రస్థానం (పొన్నం రవిచంద్ర)

థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్: మహామనిషి డా.ఏఎస్‌‌ రావు (బాలబ్రహ్మాచారి పూసపాటి) 

ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్: వనజీవి రామయ్య 

సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్: మౌనమే నీ భాష 

థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్: సైబర్  స్లేవరీ 

బెస్ట్ బుక్‌‌ అవార్డ్: ప్రభు (శూన్యం నుంచి శిఖరాగ్రాలకు) 

బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా: సీ హెచ్ రమేష్​ బాబు