పోలీస్ స్టేషన్ లో రైతుపై దాడి .. గజ్వేల్ ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్

పోలీస్ స్టేషన్ లో  రైతుపై  దాడి .. గజ్వేల్ ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్

సిద్దిపేట జిల్లా: గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో రైతుపై ఎస్‌ఐ దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ మల్లారెడ్డిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ పరిధిలోని గిరిపల్లికి చెందిన రవికి బోరు మోటారు నీటి వినియోగం విషయంలో బంధువులతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో బంధువులు దాడి చేయడంతో రవికి గాయాలయ్యాయి. దీంతో తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు రవి గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.

అయితే, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రవిపై ఎస్‌ఐ మల్లారెడ్డి దాడి చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐ చెంపపై కొట్టడంతో రవి కంటికి గాయమై రక్తస్రావం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

ఈ ఘటనపై గజ్వేల్ ఏసీపీ నర్సింలు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ మల్లారెడ్డిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.