పండుగ పూట హైదరాబాద్ సిటీ వాసులకు ఉపశమనం కలిగించే వార్త చెప్పారు జలమండలి అధికారులు. 2026 అక్టోబర్ 20న కారు ఢీకొట్టి పగిలిపోయిన మంచినీటి పైప్ లైన్ రిపేర్ ను కేవలం ఐదు గంటల్లో పూర్తి చేశారు. ప్రధాన పైప్ లైన్ పగిలి ఇక రెండు మూడు రోజులు నీళ్లు వచ్చుడు కష్టమే అనుకుంటున్న సమయంలో.. మరమ్మతులు పూర్తి చేసి గుడ్ న్యూ్స్ చెప్పారు.
తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో పైపు పగిలిపోయి మంచినీరు రోడ్లపైన ఏరులై పారింది. దీంతో ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు అధికారులు. ట్రాన్స్మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల సమన్వయంతో పనులు పూర్తి చేశారు.
మరమ్మతుల అనంతరం సంబంధిత ప్రాంతాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జలమండలి సత్వర చర్యలు తీసుకుంది. మరమ్మతులు పూర్తి చేసిన జలమండలి బృందానికి ఎండీ అభినందనలు తెలిపారు. ప్రజలకు నిరంతరాయం తాగునీటి సరఫరా అయ్యేలా చూడటమే ప్రథమ ప్రాధాన్యం అని ఈ సందర్భంగా జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి తెలిపారు.
ప్రమాదం జరిగింది ఇలా:
ఉప్పల్ భగాయత్ సమీపంలో కృష్ణా ఫేజ్-2 పైప్‌లైన్ ను కారు ఢీకొట్టడంతో భారీ లీకేజీ అయ్యింది. 2026 అక్టోబర్ 20న తెల్లవారు జామున నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 దగ్గర ఈ ఘటన జరిగింది. పైప్‌లైన్ ఎయిర్ వాల్వ్‌ల వ్యవస్థను కారు ఢీకొట్టింది. ప్రమాదవశాత్తు ఎయిర్ వాల్వ్‌లు దెబ్బతినడంతో భారీగా నీటి లీకేజీ జరిగింది. దీంతో పలు ప్రాంతాలకు నీటి అంతరాయం ఏర్పడనున్నట్లు ప్రకటించారు అధికారులు.
బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, బీరప్పగడ్డ, రామంతాపూర్, ఉప్పల్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, పద్మారావునగర్, బేగంపేట, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్ ప్రాంతాల్లోనూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ ప్రాంతాలతో పాటు వైశాలినగర్, మీర్‌పేట, బడంగ్‌పేట, ఏఆర్‌సీఐ ప్రాంతాలు, బాలాపూర్, మైసారం, మారేడపల్లి ప్రాంతాల్లోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పైపు లైన్ ప్రనులను పునరుద్ధరించడంతో నీటి సరఫరా యాధావిదిగా ఉంటుందని తెలిపారు.
