చేతిలో దంతవైద్య విద్య డిగ్రీ.. దుబాయ్‌లో డాక్టర్‌గా స్థిరపడాలనే లక్ష్యం.. కానీ, అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన డ్యాన్స్ ఫిట్‌నెస్‌పై ఆసక్తి కెరీర్‌నే మార్చేసింది. దంతవైద్యురాలిగా పనిచేయాలనుకున్న ఆమె, చివరికి ఫిట్నెస్ కోచ్‌గా మారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు నెలకు రూ.10 లక్షలకు పైగా సంపాదిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎవరో కాదు... భారతీయ మహిళ మోనికా సింగ్.
దుబాయ్‌లో మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన కోచింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మోనికా ప్రస్తుతం నెలకు 42,000 నుంచి 45,000 యూఏఈ దిర్హమ్లు సంపాదిస్తున్నారు. భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ.10.9 లక్షల నుంచి రూ.11.6 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆమె 23 మంది క్లయింట్లకు ఫిట్నెస్ కోచింగ్ అందిస్తున్నారు. ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న మహిళలు వారి ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని కాపాడుకునేలా వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు.
దంతవైద్యురాలిగా కెరీర్
ది నేషనల్ కథనం ప్రకారం.. మోనికా సింగ్ సుమారు 12 సంవత్సరాల క్రితం దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ దంతవైద్యురాలిగా పనిచేయాలనేది ఆమె లక్ష్యం. ఇందుకోసం దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) నిర్వహించే లైసెన్సింగ్ పరీక్షలకు కూడా హాజరయ్యారు. అయితే, పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సరదాగా డ్యాన్స్ ఫిట్నెస్ క్లాసెస్ వెళ్లడం ప్రారంభించారు. మొదట్లో కేవలం వ్యాయామం, వినోదం కోసమే వెళ్లిన ఆమెకు క్రమంగా ఆ రంగంపై ఆసక్తి పెరిగి, కొద్దికాలానికే తన కెరీర్‌ను మార్చుకునేంతగా బలపడింది.
మోనికా సింగ్‌కు మొదట ఫిట్నెస్ రంగంలో కెరీర్ పై ఆలోచనే లేదు. కానీ డ్యాన్స్ చేస్తూ వ్యాయామం చేయడం ఆమెకు బాగా నచ్చింది. దీంతో అదే రంగంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని తన భర్తతో చెప్పగా... దంతవైద్యురాలిగా పనిచేయాలనే అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టి, తనకు నచ్చిన ఫిట్నెస్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు ఆమె భర్త కూడా మద్దతు ఇచ్చారు.
మోనికా చెప్పిన వివరాల ప్రకారం, డ్యాన్స్ ఫిట్నెస్ క్లాసెస్ వెళ్లడం మొదలుపెట్టిన తర్వాతే తనకు నిజంగా ఈ రంగంలో పనిచేయాలనే ఆసక్తి ఉందని అర్థమైంది. మొదట్లో సరదాగా చేసిన పని తన జీవితంలో ముఖ్యమైన భాగమవుతుందని ఆమె ఊహించలేదు. అలా ఆమె దంతవైద్య రంగం నుంచి ఫిట్నెస్ రంగం వైపు అడుగులు వేశారు.
చిన్న స్థాయి నుంచి
ఫిట్నెస్ రంగంలోకి వచ్చిన వెంటనే ఆమె సొంత వ్యాపారాన్ని ప్రారంభించలేదు. ముందుగా దుబాయ్‌లోని వివిధ స్టూడియోల్లో గ్రూప్ వర్కౌట్ క్లాసెస్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు.
ఈ క్లాసెస్ లో ఒకేసారి పలువురికి వ్యాయామాలు నేర్పించేవారు. అలా పనిచేయడం ద్వారా ఫిట్నెస్ రంగంలో అనుభవాన్ని సంపాదించుకున్నారు. క్లయింట్లతో ఎలా వ్యవహరించాలి ? వారికి ఎలాంటి వ్యాయామాలు అవసరం ? వారి ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా ఎలా శిక్షణ ఇవ్వాలి ? వంటి విషయాలపై అవగాహన పెంచుకున్నారు. ఈ అనుభవమే తర్వాత సొంత వెల్నెస్ కోచింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగపడింది. ఒకప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆమె, ఇప్పుడు తనకంటూ ఒక వ్యాపారాన్ని నిర్మించుకుని ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకున్నారు.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
మోనికా సింగ్‌కు దంతవైద్య విద్య ద్వారా మానవ శరీర నిర్మాణం, శరీరధర్మ శాస్త్రం వంటి అంశాలపై ముందుగానే అవగాహన ఉంది. ఫిట్నెస్ రంగంలోకి వచ్చిన తర్వాత ఈ అవగాహన మరింత పెంచుకున్నారు. ముఖ్యంగా మధ్య వయసులో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య, ఫిట్నెస్ అవసరాలపై అధ్యయనం చేసి, సంబంధిత శిక్షణను కూడా పూర్తి చేశారు.
వయసు పెరిగే కొద్దీ మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అలాంటి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడం, వారికీ సరిపోయే వ్యాయామ పద్ధతులను ఎంచుకోవడం ముఖ్యం.
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మోనికా మహిళలకు ఫిట్నెస్ కోచింగ్ అందిస్తున్నారు. అధిక శారీరక శ్రమకు గురికాకుండా, అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకుంటూ ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకునేలా వారికి సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో 23 మంది క్లయింట్లకు ఆమె కోచింగ్ ఇస్తున్నారు. మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆమె వ్యాపారంలో ముఖ్యమైన అంశంగా మారింది.
నెలకు రూ.10.9 లక్షల నుంచి
మోనికా సింగ్ ప్రస్తుతం సంపాదిస్తున్న ఆదాయం అందరినీ ఆకర్షిస్తోంది. ఆమె వెల్నెస్ కోచింగ్ వ్యాపారం ద్వారా నెలకు 42,000 నుంచి 45,000 దిర్హమ్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ మొత్తం ఆమె వ్యాపారం ద్వారా వచ్చే ప్రతినెలా ఆదాయం. ఒకప్పుడు దంతవైద్యురాలిగా కెరీర్‌ను ప్రారంభించాలనుకున్న ఆమె, తనకు నచ్చిన మరో రంగంలో వ్యాపారాన్ని నిర్మించుకుని ఈ స్థాయిలో ఆదాయం సంపాదించడం విశేషం.
