షాకింగ్ నిర్ణయాలతో ప్రపంచానికి వణుకు పుట్టించే నార్త్ కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్న చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కిమ్ మృతితో ఆయన సోదరి పగ్గాలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఉత్తర కొరియాలోవారసత్వ సంక్షోభం భయంతో చైనా 9 వేల మంది సైనికులను ప్యోంగ్యాంగ్‌కు పంపిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
చైనా డెమోక్రసీ పార్టీ (CDP) ఛైర్మన్ వాన్‌జున్ జీ స్టేట్మెంట్ తో ఈ గందరగళం నెలకొంది. కిమ్ జోంగ్-ఉన్ తీవ్రమైన సెరెబ్రల్ హెమరేజ్ (మెదడు రక్తస్రావం)తో కోమాలోకి వెళ్లారని, చనిపోయారని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కొరియా వైద్య సౌకర్యాలు సరిపోకపోవడంతో చైనా సహాయం కోరారని ఆయన పేర్కొన్నారు.
పీకింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వైద్య బృందం చికిత్స చేసినట్లు, తర్వాత కిమ్‌ను అత్యవసర శస్త్రచికిత్స కోసం బీజింగ్‌కు తరలించినట్లు చెప్పారు. అయినా పరిస్థితి తీవ్రంగా ఉండి చికిత్స సమయం దాటిపోవడంతో ఆయన మరణించినట్లు జీ వాదించారు. ఆయన శరీరాన్ని ఉత్తర కొరియాకు తిరిగి తీసుకువచ్చారని, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారని కూడా ఆయన అన్నారు.
కిమ్ యో-జోంగ్ అధికారం చేపట్టారా?
జీ మరో వాదన ప్రకారం, కిమ్ జోంగ్-ఉన్ స్థానంలో ఆయన కుమార్తె కిమ్ జు-ఏకు బదులు, కిమ్ సోదరి కిమ్ యో-జోంగ్ పాలన చేపట్టారని తెలిపారు. సైన్యంపై తన అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆమె దక్షిణ కొరియా పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు, లౌడ్‌స్పీకర్ ప్రసారాలు, హెచ్చరిక కాల్పులు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇవి ఆమె స్థానాన్ని బలపరచుకునే ప్రయత్నంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వాదనలకు ఎలాంటి అధికారిక నిర్ధారణ ఇప్పటి వరకు లేదు.
9,000 చైనా సైనికుల మోహరింపు ఆరోపణ
వారసత్వ సంక్షోభం లేదా అంతర్యుద్ధం భయంతో చైనా 9 వేల మంది సైనికులను ప్యోంగ్యాంగ్‌కు పంపిందని కూడా జీ ఆరోపించారు. ఇది కిమ్ జు-ఏ స్థానాన్ని స్థిరపరచడానికి అని ఆయన పేర్కొన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నార్తర్న్ థియేటర్ కమాండ్ అధిక అప్రమత్త స్థితిలో ఉందని, సెలవులు రద్దు చేసినట్లు కూడా ఆయన చెప్పారు.
ఫోటోలతో షాకిచ్చిన ఉత్తర కొరియా ప్రభుత్వం:
కిమ్ మరణించారనే వార్తలు ఆసియా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే అదంతా తప్పుడు ప్రచారం అని.. వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం పేర్కొంది. 2026 అక్టోబర్ 19 (సోమవారం) జరిగిన ఒక ప్రదర్శనలో కిమ్ జోంగ్-ఉన్ పాల్గొన్నట్లు ఫోటోలు విడుదల చేసింది. బతికే ఉన్నారని.. తప్పుడు కథనాలను ప్రచారం చేయవద్దని ప్రభుత్వం సూచించింది.
