నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి కేటీఆర్ ..సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే తత్వం: కవిత

నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి కేటీఆర్ ..సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే తత్వం: కవిత
  • నమ్మినోళ్లను   నట్టేట ముంచే వ్యక్తి కేటీఆర్​ 
  •     సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే తత్వం: కవిత
  •     ఇంటి మనిషినైన నన్నూ కిరాయి మనుషులతో తిట్టించిండు
  •     సాయం చేసిన ప్రతిమ శ్రీనివాస రావుకు వ్యతిరేకంగా లేఖ రాయడం కేటీఆర్ నైజం
     

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ నమ్ముకున్నోళ్లనే నట్టేట ముంచే రకమని టీఆర్ఎస్ చీఫ్​ కల్వకుంట్ల కవిత అన్నారు. విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాలపై విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాస్ రావుకు వ్యతిరేకంగా కేటీఆర్ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఉద్యమకాలంలో టీఆర్ఎస్​ పార్టీని ఆదుకున్న ఏకైక వ్యక్తి ప్రతిమ శ్రీనివాస్​రావు అని, ఆయనకు వ్యతిరేకంగా రాసిన ఆ లేఖ కేటీఆర్​క్యారెక్టర్​కు ప్రతిరూపమని పేర్కొన్నారు. సాయం చేసిన వాళ్లను, కుల బంధువులను ఇబ్బంది పెట్టడం.. ఇంటి మనిషినైనా తననూ కిరాయి మనుషులతో తిట్టించే నైజం కేటీఆర్ ది అని మండిపడ్డారు.

తెలిసి చేసిండో లేదా తెలియక చేసిండో గానీ లేఖ రాయడం కేటీఆర్​అజ్ఞానాన్ని తెలియజేస్తున్నదన్నారు. సొంత మనుషులపైనే ఉడుకు నీళ్లు పోసే వ్యక్తి కేటీఆర్ అని ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆమె బంజారాహిల్స్​లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో బీఆర్ఎస్ సభ పెట్టి బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారే తప్ప కార్మికుల కష్టాలను కనీసం ప్రస్తావించలేదని కవిత ఆరోపించారు. తమ పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వచ్చి సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. 

కరువుపై ముందస్తు చర్యలేవి?

కరువు ముప్పుపై జనవరిలోనే నిపుణులు హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతులు త్యాగాలు చేయాలంటున్న సీఎం.. ఎకరానికి రూ.10 వేల పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయకుండా దాటవేస్తున్నారని మండిపడ్డారు. యాసంగిలో పంటలు సాగు చేయకపోతే రైతు కూలీలు, రైతులు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లే దుస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో 28 శాతం లోటు వర్షపాతం నమోదైనా ప్రభుత్వం అలర్ట్ కాలేదన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణపై గతంలో మాట్లాడిన రేవంత్.. ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్‌‌లోని కొన్ని కాంపొనెంట్లను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పవర్ మ్యాక్స్ కంపెనీతో ఆయనకు ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు. నవంబర్ నెలాఖరు వరకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్​ చేసిన తప్పులే చేస్తున్నరు

రేవంత్ రెడ్డి మూడేళ్ల పాలనలో పాలమూరు-రంగారెడ్డి పూర్తి కాలేదని, మేడిగడ్డ రిపేర్లు చేయలేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ రూ.1.86 లక్షలు ఖర్చు చేసినా ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కాంగ్రెస్ రూ.26 వేల కోట్లు ఖర్చు పెట్టినా కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ తప్పులే కాంగ్రెస్ చేస్తూ ఏపీకి కృష్ణా నీటిని ధారాదత్తం చేస్తోందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతే 8 వేల చెరువులు మాయమవడంతో నగరంలో నీటి కొరత ఏర్పడిందని, భూగర్భ జలాలు అడుగంటాయని ఆరోపించారు. చెరువులను కాపాడాల్సిన హైడ్రా ఏం చేస్తోందని నిలదీసిన ఆమె.. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.