పర్యాటక వైభవం ఎప్పుడో..?..మంచిర్యాల జిల్లాలో అభివృద్ధికి దూరంగా పర్యాటక ప్రాంతాలు

పర్యాటక వైభవం ఎప్పుడో..?..మంచిర్యాల జిల్లాలో అభివృద్ధికి దూరంగా పర్యాటక ప్రాంతాలు
  •     12వ శతాబ్ది గోడురాజుల చరిత్రకు సాక్ష్యంగా గాంధారి ఖిలా 
  •     తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన గూడెం టెంపుల్​ 
  •     కవ్వాల్ టైగర్​ జోన్, శివ్వారం మొసళ్ల కేంద్రం, ప్రాణహిత వైల్డ్​లైఫ్​ 
  •     ఏండ్లు గడుస్తున్నా ప్రపోజల్స్​ దశ దాటని టూరిజం సర్క్యూట్​

మంచిర్యాల, వెలుగు: చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ పచ్చని ప్రకృతి ఒడిలో విహరించాలనుకునే టూరిస్టులకు మంచిర్యాల జిల్లా ఆహ్వానం పలుకుతోంది.​ గాంధారి ఖిలా, గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్, మరోవైపు కవ్వాల్​ టైగర్​ జోన్, ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం, శివ్వారం మొసళ్ల మడుగు వంటి అనేక టూరిస్టు అట్రాక్షన్స్​ ఈ జిల్లాలో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో మందమర్రి మండలం బొక్కలగుట్ట శివార్లలో ఇసుక రాతి గుట్టలపై నిర్మించిన గాంధారి ఖిలా నాడు గోండు రాజుల పరిపాలన కేంద్రంగా విలసిల్లింది. కోట నిర్మాణం, లోపల రాతి గోడలపై చెక్కిన కాలభైరవుడు, శివుడు, గణపతి, ఆంజనేయుడు వంటి ప్రతిమలు చరిత్రకు నిలువుటద్దాలు. కోట ద్వారా ప్రారంభంలోనే కొలువైన మైసమ్మ తల్లిని నాయక్​పోడ్​ తెగ గిరిజనుల ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఇక్కడ జాతర వైభవంగా జరుగుతుంది. ఖిలా సమీపంలో దట్టమైన అడవిలో ఎత్తయిన గుట్టల పైనుంచి పాలనురగలా జాలువారే ‘క్షీర’ జలపాతం సోయగాన్ని చూసితీరాల్సిందే. ట్రెక్కింగ్​ చేస్తూ వాటర్​ఫాల్​పై భాగానికి చేరుకోవడం నిజంగా అడ్వెంచర్. 

ఆకట్టుకుంటున్న అగస్త్య గుండం

దండేపల్లి మండలం గోదావరి తీరంలో గూడెం గుట్టపై కొలువైన సత్యనారయణ స్వామి టెంపుల్​తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వత్రాలు, పూజలు ఘనంగా నిర్వహిస్తారు. రూ.75 కోట్లతో టెంపుల్​పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇవి పూర్తయితే టూరిస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. సప్త రుషుల్లో ఒకరైన అగస్త్య మహాముని నడయాడిన నేల చెన్నూర్​లోని అగస్త్య గుండాన్ని తప్పకుండా చూసి తీర్చాల్సిందే. అగస్త్య గుండం పునర్మిర్మాణ పనులకు మంత్రి వివేక్​ వెంకటస్వామి రూ.17 కోట్లు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. బెల్లంపల్లి మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో గల బుగ్గ రాజేశ్వరస్వామి, చెన్నూర్​మండలం కత్తెరశాలలోని మల్లికార్జునస్వామి, జైపూర్​మండలం వేలాల గుట్టపై వెలిసిన గట్టు మల్లన్న, కోటపల్లి మండలం పారుపల్లిలోని కొలువైన కాలభైరవ స్వామి ఆలయం టెంపుల్​ టూరిజంలో ప్రధాన అట్రాక్షన్స్​గా చెప్పవచ్చు. 

 ఎకో టూరిజం

మంచిర్యాల జిల్లా ఎకో టూరిజంకు ఫేమస్. కవ్వాల్​టైగర్​ రిజర్వ్ రకరకాల వన్యప్రాణులు, పక్షి జాతులకు నిలయం. కనుచూపుమేరలో ఎటుచూసినా పచ్చని అడవి, గుట్టలు, సెలయేళ్లు, నీటికుంటలతో ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి. సఫారీ రైడ్​కు వెళ్తే చిరుతలు, నీలుగాయిలు, జింకలు, దుప్పులు, అడవిదున్నలు వంటి వైల్డ్​ లైఫ్​ను చూడవచ్చు. ప్రాణహిత నదీపరివాహక ప్రాంతంలో గల ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యం,  జైపూర్​ మండలం శివ్వారం శివారు గోదావరిలో గల మొసళ్ల సంరక్షణ కేంద్రం ఎకో టూరిస్టులకు మరో ఆప్షన్.​ ఇక్కడ అరుదైన కృష్ణ జింకలు, మగ్గర్​జాతి మొసళ్లను చూడవచ్చు. మంచిర్యాలకు 10 కి.మీ. దూరంలో ర్యాలీ ఫారెస్టులో ఏర్పాటు చేసిన జంగిల్​సఫారీని ఎంజాయ్​చేయాల్సిందే. 

కోల్​మైన్స్, ఎస్టీపీపీ... 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​, జైపూర్​, రామకృష్ణాపూర్​, మందమర్రి, కాసిపేట, బెల్లంపల్లి ప్రాంతాల్లో సింగరేణి కోల్​మైన్స్​ విస్తరించి ఉన్నాయి. ముందుగా పర్మిషన్​ తీసుకొని ఓపెన్ కాస్ట్​ ప్రాజెక్టులు, అండర్​మైన్స్​లోకి దిగి బొగ్గు తవ్వకాలను చూడవచ్చు. జైపూర్​లోని ఎస్టీపీపీని సైతం సందర్శించవచ్చు. 
 

అభివృద్ధికి దూరం
మంచిర్యాల జిల్లాలో టెంపుల్​, ఎకో టూరిజం డెవలప్​మెంట్​కు అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వెనుకబాటుకు గురవుతోంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం తలపెట్టిన టూరిజం సర్క్యూట్​ ఏండ్లు గడుస్తున్నా ప్రపోజల్స్​ దశ దాటి ముందుకు సాగకపోవడం జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అపారమైన అటవీ సంపద, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నప్పటికీ సరైన మౌలిక వసతులు, పబ్లిసిటీ లేకపోవడం వల్ల టూరిజం హబ్‌‌‌‌గా మారలేకపోతోంది. 

మంచిర్యాలకు 12 కి.మీ. దూరంలో గోదావరిపై గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో బోటింగ్​ కలగానే మిగిలింది. గాంధారి ఖిలా, శివ్వారం మొసళ్ల మడుగుల అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గాంధారి ఖిలా, మొసళ్ల మడుగు వద్ద గుట్టలపై ట్రెక్కింగ్ ఏర్పాట్లకు ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ ప్లాన్ ​రెడీ చేస్తోంది. జిల్లాను పర్యాటక హబ్‌‌‌‌గా మార్చడానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ మోడల్)తో వసతులు కల్పిస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా జిల్లాకు ఆదాయం సైతం పెరుగుతుంది.